ఈ గాడ్జెట్ ఉంటే ఫిట్నెస్ ట్రైనర్ అవసరం లేదట!
బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ సమాచారాన్ని తెలుసుకొని ఫిట్నెస్ను కాపాడుకోవటానికి ఉపయోగపడే గాడ్జెట్ ఒకటి ఇప్పుడు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొందరైతే ఇది ఉంటే చాలు ఇక పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ అవసరమే లేదంటున్నారు. అంతలా ఆకట్టుకుంటున్న ఆ గాడ్జెట్ పేరు 'స్కల్ప్ట్ చిసెల్'. ఐపాడ్ పరిమాణంలో ఉండే ఈ గాడ్జెట్.. ఫోన్లోని యాప్ సహాయంతో మీ ఫెట్నెస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
చిసెల్ బేసిక్‌గా ఒక సెన్సర్. ఇది చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వుల పరిమాణాన్ని అంచనా వేస్తుంది. అంతేకాదు, కండరాల సామర్థ్యాన్ని గురించి కూడా మనకు తెలుపుతోంది. చిసెల్ ఎలాంటి స్క్రీన్‌ను కలిగి ఉండదు. దానిపై గల చిన్న చిన్న మెటల్ స్ట్రిప్స్ ద్వారా బాడీ రీడింగ్‌ను తీసుకొని సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అందిస్తుందన్నమాట. చేతులు, కాళ్లు, ఉదరభాగంతో పాటు శరీరంలోని ఇతర కండరాలు, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ గాడ్జెట్ ద్వారా తెలుసుకొని.. ఫలితాలకు అనుగుణంగా వ్యాయామాన్ని మార్చుకోవచ్చు.
దీనిని ఒకసారి చార్జ్ చేస్తే చాలు రెండు వారాల వరకు మళ్లీ చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ 9వేల వరకూ ఉంది. పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజులతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉందని వినియోగదారులు భావిస్తున్నారు.