ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ
చిత్రం: ‘ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్ (ఎఫ్.సి.యు.కె)’
తారాగణం: జగపతిబాబు, అమ్ము అభిరామి, రామ్ కార్తీక్, బేబీ సహస్రిత, కల్యాణీ నటరాజన్, భరత్, బ్రహ్మాజీ
మాటలు: కరుణాకర్ అడిగర్ల – బాలాదిత్య
పాటలు: బాలాదిత్య
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
ఫైట్స్: స్టంట్స్ జాషువా
కెమెరా: జి. శివకుమార్
ఎడిటింగ్: కిశోర్ మద్దాలి
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్;
కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిడివి: 169 నిమి షాలు
రిలీజ్: ఫిబ్రవరి 12
ఒకే సినిమాలో ఎన్నో కథలు చెప్పాలనుకుంటే ఏమవుతుంది? అసలు ఎత్తుకున్న కథ కన్నా మిగతా చుట్టూ అనేక అంశాలు అల్లుకుంటూ పోతే ఏమవుతుంది? కానీ, కుటుంబ కథ చుట్టూరానే తిరగాల్సిన కథను ఎడల్ట్ కామెడీ వ్యవహారంగా మారిస్తే ఏమవుతుంది? డబ్బులు ఎదురిచ్చి ఓ రెండుమ్ముప్పావు గంటలు ఈ పాఠాలన్నీ తెలుసుకోవాలంటే– తాజా రిలీజ్ ‘ఎఫ్.సి. యు.కె’ (ఫాదర్–చిట్టి – ఉమ– కార్తీక్) చూడాలి.
కథేమిటంటే..: లేటు వయసులో ఓ పిల్లకు తండ్రి అయిన వ్యక్తి, దాని వల్ల అతని కొడుకుకు వచ్చిన ఇబ్బందులు ఈ చిత్ర ప్రధాన కథ. ఫణి భూపాల్ (జగపతిబాబు) రెండు రాష్ట్రాల్లో ఒక కండోమ్ కంపెనీకి డీలర్. 60 ఏళ్ళ వయసొచ్చినా, అమ్మాయిలతో సరదాలు మానని మనిషి. అతని కొడుకు – తల్లి లేకుండా పెరిగినవాడు కార్తీక్ (రామ్ కార్తీక్). అనుకోకుండా ఓ పిల్లల డాక్టర్ ఉమ (అమ్ము అభిరామి) పరిచయమవుతుంది. ఆమెకూ, అతనికీ స్నేహం పెరిగే లోపలే బంధుత్వాల మీద రిసెర్చ్ చేసే ఓ కుర్రాడు (భరత్)తో ఆమెకు పెళ్ళి కుదురుతుంది. ఉమకూ, కార్తీక్‌కూ మధ్య స్నేహం, పొరపొచ్చాలు సాగుతుండగానే, అరవై ఏళ్ళ తండ్రి తనకు పుట్టిన పసిపాప చిట్టి (బేబీ సహస్రిత)ను తీసుకువస్తాడు. ఎవరా పాప? ఏమిటా కథ? కార్తీక్‌కూ, ఉమకూ మధ్య స్నేహం ఏమైంది అన్నది మిగతా కథ.
ఎలా చేశారంటే..: అమ్మాయిలను చటుక్కున పడేసే కళ ఉన్న తండ్రి ఫణి భూపాల్‌గా జగపతిబాబు నటించారు. నిజజీవితంలోనూ 60వ పడిలోకి వస్తున్న ఆయన ఇలాంటి రిస్కీ పాత్ర చేయడం విశేషమే. కానీ, ఆ పాత్రలో జనం ఆయనను ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పడం కష్టం. ఫ్లర్ట్ మాస్టర్ అయిన కొడుకు పాత్రలో రామ్ కార్తీక్ కామెడీ, ఫైట్లు, రొమాన్స్– ఇలా అన్నీ చేయడానికి శతవిధాల ప్రయత్నించారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన తమిళమ్మాయి అమ్ము అభిరామి ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’లో స్కూల్ అమ్మాయిగా కనిపించారు. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ (తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ అవుతోంది)లో హీరో ధనుష్ సరసన నటించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇరవై ఏళ్ళ అభిరామి ఇందులో పిల్లల డాక్టర్ ఉమ పాత్రను పండించడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పాత్రను రాసుకున్న విధానంలోనే ఉన్న తప్పులకు ఆమె బాధ్యురాలు అయింది. ఆ పాత్ర స్నేహం కోరుతోందా, ప్రేమ కోరుతోందా, వాటన్నిటికీ మించి సమాజంలో స్త్రీని చూడాల్సిన విధానంపై పోరు చేస్తోందా అన్నది ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. దగ్గుబాటి రాజా, జయలలిత, శ్రీలక్ష్మి, మెల్కోటే లాంటి పాత తరం నటీనటుల మొదలు ఈ తరం భరత్ దాకా సినిమాలో చటుక్కున చెప్పలేనంత చాలామందే ఉన్నారు. నిడివి, లేని ఆ పాత్రల నుంచి అద్భుతాలు ఆశించలేం.
ఎలా తీశారంటే..: ‘‘ఆకలేస్తే అన్నం పెడతాం. అవసరమైతే సాయం చేస్తాం. ఆడాళ్ళడిగితే కాదంటామా... ఇచ్చేస్తాం’’ అనే తండ్రి, ‘‘తల్లిని తెస్తా... తల్లిని తెస్తా.. అని చెల్లిని తెచ్చావేంటి’’ అని ప్రశ్నించే కొడుకు, ‘‘బండి ఇంకా కండిషన్ లోనే ఉంది అంకుల్...’’ అనే చుట్టుపక్కలి ఫ్రెండ్సు – ఇలా ఉంటుందీ సినిమా. 1970లలో మొదలైన శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తండ్రి కీ.శే. కానూరి రంజిత్ కుమార్ బాటలో ఇప్పటికే చాలా సినిమాలు తీశారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. గతంలో ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు – ఆ తరువాత’ లాంటి ఫ్యామిలీ కథాంశాలతో ఆకట్టుకున్న ట్రాక్ రికార్డ్ ఆయనది. కానీ, ఈసారి ఎడల్ట్ కామెడీ చిత్రంతో ఇలాంటి సాహసం చేయడం విచిత్రం.
మూడేళ్ళ క్రితం ‘రచయిత’ (2018) చిత్రం రూపొందించిన దర్శకుడు విద్యాసాగర్ రాజుకు ఇది రెండో సినిమా. కానీ, ఆయన కథ రాసుకోవడం మీద ఎంత శ్రద్ధ పెట్టారన్నది ప్రశ్న. తీసిన సినిమా కన్నా ముందు... రాసుకున్న స్క్రిప్టుకు ఎడిటింగ్ అవసరమనే విషయం మర్చిపోయినట్టున్నారు. కన్యాత్వ పరీక్ష, కండోమ్ లకు ఎందుకు యాడ్స్ వేయాలి, పెట్రోల్ ఎలా ఆదా చేయాలి, వయసు పైబడినంత మాత్రాన కోరికలు పోతాయా – ఇలాంటి చాలా విషయాల మీద ఈ చిన్న సినిమాలో చర్చలూ పెట్టారు. పాత్రలు మాటిమాటికీ వాష్ రూమ్‌కు వెళతామని సైగ చేసే ఈ చిత్రంలో అపానవాయువు, పసిపాపల డైపర్ క్లీనింగ్ లాంటి వాటినీ కామెడీ అనుకొని వాడినట్టున్నారు. ‘‘నా జీవితంలో ఏ ప్రాబ్లమ్ లేకపోవడానికి కారణం మా నాన్న’’ అనే కొడుకు, తీరా తన ‘‘జీవితంలో నాకు సమస్యే నువ్వు’’ అని తండ్రిని ప్రశ్నించే స్థాయికి ఎందుకు వచ్చాడన్నది అసలు కథ. ఆ ఎమోషనల్ యాంగిల్ చుట్టూ కథను మరో రకంగా రాసుకొని ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది.
గమ్మత్తేమిటంటే, కథ కూడా తానే రాసుకున్న దర్శకుడు అనుకున్నప్పుడు అనుకున్నట్టల్లా పాత్రల ప్రవర్తన మారిపోతుంటుంది. బలమైన కార్యకారణ సంబంధం కనిపించేది తక్కువ. అనేక మలుపులు తిరుగుతూ సా...గిపోయే కథలో అడపాదడపా బోలెడంత క్రియేటివిటీ పొంగి పొరలుతుంది. సినిమా మధ్యలో సరిగ్గా ఇంటర్వెల్ ముందు పాత్రలతో మన జాతీయ గీతం ‘జనగణమన...’ పాడించడం అందులో హైలైట్. భీమ్స్ సెసిరోలియో సంగీతం, జె.బి. నేపథ్య సంగీతం అందించారు. ‘నేనేం చెయ్య...’ పాట కాస్తంత బాగున్నా, హాలు దాటాక ఎన్ని గుర్తుంటాయో చెప్పలేం. నటుడు బాలాదిత్య ఈ సినిమాకు 4 పాటలు, కరుణాకర్ అడిగర్లతో కలసి మాటలు సమకూర్చడం మరో విశేషం. దురర్థం ధ్వనించేలా సినిమాకు ఇలా ‘ఎఫ్.సి.యు.కె’ అని పేరు ఎందుకు పెట్టారంటే – కేవలం జనం దృష్టిని ఆకర్షించడం కోసమేనని దర్శక, నిర్మాతలు ఆ మధ్య వివరణ ఇచ్చారు. కానీ, ఆ టైటిల్ ఇప్పుడీ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చెప్పలేం. ఈ చిత్రం ఓ ఫన్ వ్యాక్సిన్ అని చిత్రయూనిట్ మాట. వెరసి, వ్యాక్సిన్ వేసుకుంటే, కాస్తంత సైడ్ ఎఫెక్ట్లకూ సిద్ధపడాల్సిందే!
కొసమెరుపు: మరీ ఇన్ని మలుపులతో... ఇంతసేపా... చిట్టీ!
బలాలు
♦ బేసిక్ స్టోరీ లైన్ ∙జగపతిబాబు లాంటి పాపులర్ ఫేస్‌లు
♦ అక్కడక్కడి మెరుపులు
బలహీనతలు
♦ బోలెడన్ని మలుపులు, సాగదీత కథనం
♦ హీరో హీరోయిన్లు అపరిచితులు కావడం
♦ ఎడల్ట్ కంటెంట్, ముతక కామెడీ
♦ దర్శకత్వం, ఎడిటింగ్ లోపాలు
రివ్యూ: రెంటాల జయదేవ