నాదల్కు షాక్
తొలి రౌండ్లోనే ఓడిన స్పెయిన్ స్టార్
* మారథాన్ మ్యాచ్‌లో వెర్డాస్కో సంచలనం
* రెండో సీడ్ హలెప్‌కు చుక్కెదురు
* వీనస్, అండర్సన్ కూడా ఇంటిముఖం
* ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు కొత్త ఏడాదీ కలసిరాలేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ మాజీ చాంపియన్ అనూహ్యంగా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
స్పెయిన్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఫెర్నాండో వెర్డాస్కో అద్వితీయ ఆటతీరును కనబరిచి ఐదో సీడ్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. 4 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ వెర్డాస్కో 7-6 (8/6), 4-6, 3-6, 7-6 (7/4), 6-2తో నాదల్‌ను కంగుతినిపించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో నాదల్‌తో 5 గంటల 14 నిమిషాలపాటు పోరాడి ఓడిపోయిన వెర్డాస్కో ఈసారి చిరస్మరణీయ ప్రతీకారం తీర్చుకున్నాడు.
* తన కెరీర్లో ఇప్పటివరకు 44 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన నాదల్ రెండోసారి మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో నిష్ర్కమించాడు. ఇంతకుముందు అతను 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోయాడు.
* నాదల్‌తో జరిగిన పోరులో 33 ఏళ్ల వెర్డాస్కో 20 ఏస్‌లు సంధించి, 10 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన వెర్డాస్కో తర్వాతి రెండు సెట్లను కోల్పోయాడు. నాలుగో సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో వెర్డాస్కో ఆరంభంలోనే సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనుకబడ్డాడు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వెర్డాస్కో ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి నాదల్ ఓటమిని ఖాయం చేశాడు.
* కెరీర్లో వరుసగా 51వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతోన్న వెర్డాస్కో ఈ మ్యాచ్‌లో 90 విన్నర్స్ కొట్టడంతోపాటు నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ఏకంగా 91 అనవసర తప్పిదాలు చేసినా వెర్డాస్కో విజయాన్ని దక్కించుకోవడం విశేషం. నాదల్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 38 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
* నాదల్‌తోపాటు 11వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), 20వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. రాజీవ్ రామ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 6-7 (4/7), 7-6 (7/4), 3-6, 0-3తో వెనుకబడిన దశలో మోకాలి గాయం కారణంగా వైదొలిగాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న అండర్సన్ ఈ మ్యాచ్‌లో పలు తప్పిదాలు చేసి అసహనంతో తన రాకెట్‌ను నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై ఓపెన్‌లో చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మరో మ్యాచ్‌లో ముల్లర్ (లక్సెంబర్గ్) 7-6 (8/6), 7-6 (9/7), 6-7 (5/7), 7-6 (7/1)తో ఫాగ్నినిపై గెలిచాడు.
ముర్రే, వావ్రింకా ముందంజ
మరోవైపు రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), పదో సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 13వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ముర్రే 6-1, 6-2, 6-3తో జ్వెరెవ్ (జర్మనీ)పై, ఫెరర్ 6-4, 6-4, 6-2తో గొజోసిక్ (జర్మనీ)పై, ఇస్నెర్ 6-3, 7-6 (9/7), 6-3తో జనోవిక్ (పోలండ్)పై, రావ్‌నిక్ 6-1, 6-4, 6-4తో పౌలీ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... వావ్రింకా 7-6 (7/2), 6-3తో రెండు సెట్లు గెలిచాక అతని ప్రత్యర్థి తుర్సునోవ్ (రష్యా) వైదొలిగాడు.
జాంగ్ షుయె సంచలనం
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఎనిమిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) అనూహ్యంగా తొలి రౌండ్లోనే పరాజయాన్ని చవిచూశారు. చైనా క్వాలిఫయర్ జాంగ్ షుయె 6-4, 6-3తో ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్‌ను కంగుతినిపించగా... జోనా కొంటా (బ్రిటన్) 6-4, 6-2తో వీనస్‌ను ఓడించింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-0, 6-4తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఏడో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-7 (4/7), 7-6 (8/6), 6-3తో మిసాకి దోయ్ (జపాన్)పై, తొమ్మిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-4తో బిరెల్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. 14వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-0, 6-0తో వాన్ ఉట్వాంక్ (బెల్జియం)ను చిత్తు చేయగా... 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-3, 7-5తో సినియాకోవా (చెక్ రిపబ్లిక్)పై, 19వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-3, 6-3తో హెర్కాగ్ (స్లొవేనియా)పై, 20వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-2, 6-3తో తామీ ప్యాటర్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు.