Finance Firm
-
5శాతం ప్రీమియం : ఇండోస్టార్ డెబ్యూ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఐపీవోలో అదరగొట్టిన ఎన్బీఎఫ్సీ సంస్థ ఇండోస్టార్ కేపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్‌లో ప్రీమియంతో డెబ్యూలో శుభారంభాన్నిచ్చింది. సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు 5 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 572 కాగా.. బీఎస్ఈలో రూ. 28 లాభంతో రూ. 600 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. . ప్రస్తుతం 3.7 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 606 వద్ద గరిష్టాని నమోదు చేసింది. ఇటీవల ఐపీవోకు దాదాపు 7 రెట్లు ఆదరణతో రూ. 1844 కోట్లను సమీకరించింది. ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఐపీవోకు భారీ స్పందన లభించింది. మొత్తం రూ.1844 కోట్లు విలువ చేసే ఐపీవో ఏడురెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూకి ముందురోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచింది. కాగా.. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తదితరాలున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ రుణాలు, వాహన రుణాల వ్యాపారంలో ఉన్నఇండోస్టార్ క్యాపిటల్ మొత్తం విలువ రూ.5,200 కోట్లుగా అంచనా. ఈ ఐపీవోకు మోతీలాల్ ఓస్వాల్, మోర్గాన్ స్టాన్లీ, నొమోరాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
పట్టపగలే భారీ దోపిడి
నాగ్‌పూర్ : పట్టపగలే ఓ ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడి జరిగింది. ఐదుగురు సాయుధ దుండగులు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడి స్థానిక ప్రజలు తాకట్టుపెట్టిన మూడు లక్షల నగదు, 9.3 కోట్ల విలువచేసే 30.9 కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన నగరంలోని ఉత్తరప్రాంతంలో గల ఝరిపట్కా పోలీసు సమీపంలో భీమ్ చౌక్ మణపురం ఫైనాన్స్ బ్రాంచ్‌లో జరిగింది. కస్టమర్లలాగా ఓ ఐదుగురు వ్యక్తులు ఫైనాన్స్ కంపెనీలోకి ప్రవేశించారు. ఆ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని ద్వారా వీరు లోపలికి ప్రవేశించారు. మొదట సంస్థలోకి వచ్చిన వ్యక్తి ముఖానికి ముసుగేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. ముఖంపై ఉన్న ముసుగుని తొలగించమని అడగగానే ఉద్యోగులను, కస్టమర్లను బందీగా తీసుకొని తుపాకీతో బెదిరించినట్టు పోలీసులు చెప్పారు. వారి దగ్గరున్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నట్టు తెలిపారు. మొత్తం తొమ్మిది మంది వ్యక్తులను ఈ తుపాకీలతో బెదిరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఈ దుండగులు సీసీటీవీ కెమెరాలను, వైర్లను ధ్వంసం చేశారు. లాకర్ వైపుకు వెళ్లిన దుండగులు అక్కడి ఉద్యోగులను బెదిరించి లాకర్ తెరిపించారు. వారు తెచ్చుకున్న రెండు సంచుల్లో లాకర్లోని నగదును, బంగారాన్ని నింపుకున్నారు. మొత్తం 20 నిమిషాలు వారు ఈ దొంగతనాన్ని ముగించుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దుండగులు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ దుండగుల కోసం పోలీసులు ఫైనాన్స్ కంపెనీ సమీపంలోని దుకాణాల సీసీటీవీ ఫుటేజ్‌లను, స్థానిక ప్రాంత వ్యక్తులను విచారిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ దగ్గర సెక్యురిటీ గార్డ్ లేకపోవడంతో దొంగలు ఈ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడటానికి తేలికైందని పోలీసులు పేర్కొంటున్నారు.