పట్టపగలే భారీ దోపిడి
పట్టపగలే భారీ దోపిడి
Published Thu, Sep 29 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
నాగ్పూర్ : పట్టపగలే ఓ ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడి జరిగింది. ఐదుగురు సాయుధ దుండగులు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడి స్థానిక ప్రజలు తాకట్టుపెట్టిన మూడు లక్షల నగదు, 9.3 కోట్ల విలువచేసే 30.9 కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన నగరంలోని ఉత్తరప్రాంతంలో గల ఝరిపట్కా పోలీసు సమీపంలో భీమ్ చౌక్ మణపురం ఫైనాన్స్ బ్రాంచ్లో జరిగింది. కస్టమర్లలాగా ఓ ఐదుగురు వ్యక్తులు ఫైనాన్స్ కంపెనీలోకి ప్రవేశించారు. ఆ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని ద్వారా వీరు లోపలికి ప్రవేశించారు. మొదట సంస్థలోకి వచ్చిన వ్యక్తి ముఖానికి ముసుగేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. ముఖంపై ఉన్న ముసుగుని తొలగించమని అడగగానే ఉద్యోగులను, కస్టమర్లను బందీగా తీసుకొని తుపాకీతో బెదిరించినట్టు పోలీసులు చెప్పారు. వారి దగ్గరున్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నట్టు తెలిపారు. మొత్తం తొమ్మిది మంది వ్యక్తులను ఈ తుపాకీలతో బెదిరించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
అనంతరం ఈ దుండగులు సీసీటీవీ కెమెరాలను, వైర్లను ధ్వంసం చేశారు. లాకర్ వైపుకు వెళ్లిన దుండగులు అక్కడి ఉద్యోగులను బెదిరించి లాకర్ తెరిపించారు. వారు తెచ్చుకున్న రెండు సంచుల్లో లాకర్లోని నగదును, బంగారాన్ని నింపుకున్నారు. మొత్తం 20 నిమిషాలు వారు ఈ దొంగతనాన్ని ముగించుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దుండగులు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ దుండగుల కోసం పోలీసులు ఫైనాన్స్ కంపెనీ సమీపంలోని దుకాణాల సీసీటీవీ ఫుటేజ్లను, స్థానిక ప్రాంత వ్యక్తులను విచారిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ దగ్గర సెక్యురిటీ గార్డ్ లేకపోవడంతో దొంగలు ఈ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడటానికి తేలికైందని పోలీసులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement