financial develop
-
సీఎం జగన్ ఆపన్న హస్తం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్ జగన్.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్ కలెక్టర్ సంపత్కుమార్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్ తల్లి టి.ఉష, బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు. -
ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్ అనే అగ్రిటెక్ యాప్ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ విభాగం హెడ్ మునీష్ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్ పేర్కొన్నారు. -
‘పట్టు’ పెంపకంతోనే ఆర్థికాభివృధ్ధి
కదిరి టౌన్ : పట్టు పురుగుల పెంపకంతో పట్టు రైతులు ఆర్థికంగా ఎదగవచ్చని కేంద్ర సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప తెలిపారు. గురువారం సాయంత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆయన విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పట్టు పరిశ్రమను ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహించేవారన్నారు. అయితే నేడు రోజురోజుకీ పెరుగుతున్న ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో పట్టుపురుగుల పెంపకం సులభతరం, లాభాదాయకంగా మారిందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పట్టుపురుగుల ఉత్పత్తిని తయారుచేస్తూ బీజేపీ ప్రభుత్వం పట్టు పరిశ్రమకు ఎన్నో రాయితీలను కల్పించి పట్టు సాగును ప్రోత్సహిస్తోందన్నారు. కర్నాటకలోని బెంగళూరులో పట్టు పరిశ్రమ పెంపకం శిక్షణా కేంద్రంలో పట్టు రైతులకు పట్టుపురుగుల పెంపకం, పట్టు సాగు తదితర మెలకువలపై ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు. పట్టు రైతులకు సిల్క్ రీలింగ్ యంత్రాలను 75 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పట్టుగూళ్ల పెంపకం, అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.