కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా?
నెహ్రూ.. ఇందిర.. రాజీవ్
1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు.
తెల్లారింది లేవండోయ్..
2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు.
రైల్వేను కలిపేశారు..
2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మొదటి బడ్జెట్‌కు 162 ఏళ్లు..
మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి
కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు.