ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్
శోభానాగిరెడ్డి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాయలసీమలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1968 నవంబర్ 16న పుట్టారు. ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి. శోభానాగిరెడ్డికి 1986లో భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 1996లో శోభా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరో దఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాయలసీమ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మల్యే ఆమె మాత్రమే.
ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ఆమె పార్టీలో చేరారు. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలో కీలక బాధ్యతలు పోషించారు. ఇప్పటివరకూ శోభానాగిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. శోభానాగిరెడ్డి సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. శోభానాగిరెడ్డి కుటుంబం కర్నూలులో ఎంతో ప్రజాసేవ చేసింది. శోభానాగిరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే కర్నూలు ప్రజలు దుఖఃసాగరంలో మునిగిపోయారు.