అంగారక దృశ్యం అదిరింది!
తొలిసారిగా మార్స్ ఫొటోలు పంపిన మామ్
ప్రధానికి బహూకరించిన ఇస్రో బృందం
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచం నివ్వెరపోయేలా.. అత్యంత చౌకగానే 66.6 కోట్ల కి.మీ. ప్రయాణించి బుధవారం అంగారకుడిని చేరుకుని అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించిన భారత మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం తొలిసారిగా మార్స్ ఫొటోలను భూమికి పంపింది. మామ్ పంపిన కలర్ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం విడుదల చేసింది. వీటిలో ఓ ఫొటోను మామ్ ఫేస్బుక్ పేజీలో ఇస్రో గురువారం ఉంచింది. అరుణగ్రహానికి 7,300 కిలోమీటర్ల ఎత్తు నుంచి మామ్ తన మార్స్ కలర్ కెమెరాతో తీసిన ఈ తొలి ఫొటో 376 మీటర్ల రిజల్యూషన్‌తో ఉందని ఇస్రో పేర్కొంది.
అలాగే మామ్ పంపిన మార్స్ ఫొటోను మార్స్ ఆర్బిటర్ మిషన్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఇస్రో పోస్ట్ చేసింది. ‘అంగారకుడి తొలి ఫొటో ఇది. ఇక్కడ దృశ్యం చాలా బాగుంది’ అంటూ మామ్ ఫొటోలకు ట్వీట్లు జతచేసింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. ‘అవును. మార్స్ ఆర్బిటర్. నిజంగా ఈ దృశ్యం చాలా బాగుంది’ అంటూ బదులు ట్వీట్ చేశారు. మామ్ పంపిన మార్స్ ఫొటోలను ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్, శాస్త్రీయ సలహాదారు వి.కోటేశ్వరరావుల బృందం గురువారం ఢిల్లీలో మోదీకి బహూకరించింది.
కీర్తిని ఇనుమడింపజేశాం: షార్ డెరైక్టర్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంగారక యాత్రను విజయవంతంగా నిర్వహించి అంతరిక్ష వినీలాకాశంలో ఇస్రో కీర్తిని మరింత ఇనుమడింపజేశామని, ఈ ఘనవిజయం వెనుక ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని షార్ డెరైక్టర్ పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. గురువారం సుప్రసిద్ధ భారత అంతరిక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ సతీష్ ధవన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రసాద్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. ప్రయోగంలో అందరి కృషీ ఉన్నప్పటికీ.. రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంలో ప్రధానంగా మూడు విభాగాలు కీలక పాత్ర పోషించాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 7- 9 తేదీల మధ్య పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని కూడా షార్ నుంచి నింగికి పంపనున్నట్లు ప్రసాద్ తెలిపారు.