PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్
పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ పేలవమైన డ్రాగా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆతిధ్య జట్టుకు ధీటుగా బదులిచ్చింది. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకే ఆలౌటై పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు నలుగురు ( ఉస్మాన్ ఖ్వాజా (97), వార్నర్ (68), లబూషేన్ (90), స్టీవ్ స్మిత్ (78) అర్ధ సెంచరీలతో రాణించగా, పాక్ బౌలర్లలో నౌమాన్ అలీ 6 వికెట్లు, షాహీన్ అఫ్రిది 2, నసీమ్ షా, సాజిద్ ఖాన్లు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (242 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్), ఇమామ్ ఉల్ హాక్ (223 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు అజేయమైన శతకాలతో విజృంభించారు. ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాది రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు.
చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..!