Fishermen Strike
-
ఆగిన వేట
తమిళ జాలర్లపై శ్రీలంక దాష్టీకాన్ని నిరసిస్తూ రామనాథపురం, జగదాపట్నానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. 15 వేల మంది జాలర్లు సమ్మెలో పాల్గొనగా 14 వేల పడవలు ఒడ్డునే ఉండిపోయాయి. చేపలవేట దాదాపు స్తంభించిపోయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ జాలర్లు శుక్రవారం నుంచి సమ్మెసైరన్ మోగించారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న 56 పడవలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడాదికి ఒకసారి అమలుచేసే చేపల వేట నిషేధం తొలగిపోయిన నాటి నుంచి జాలర్లపై శ్రీలంక దళాలు దాడులు సాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల చేపల వేటకెళ్లిన రామేశ్వరం, పంబన్, మండపం, జగదాపట్నం, నాగపట్నం ప్రాంతాలకు చెందిన 200 మంది జాలర్లను శ్రీలంక గస్తీ దళాలు నడి సముద్రంలోనే బందించాయి. వారు ప్రయాణించిన పడవలను స్వాధీనం చేసుకున్నాయి. జాలర్లను శ్రీలంక జైళ్లలోకి తోసేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడితో లంక సైన్యం మెత్తబడింది. కొందరు జాలర్లను మాత్రమే విడిచిపెట్టారు. అయితే వారి జీవనాధారమైన పడవలను మాత్రం స్వాధీనంలోనే ఉంచుకున్నారు. ఇటీవల రామేశ్వరం, జగదాపట్నంకు చెందిన 38 మంది మత్స్యకారులను శ్రీలంక సైన్యం అరెస్ట్ చేసింది. వారి నుంచి 9 పడవలను స్వాధీనం చేసుకుంది. దీంతో శ్రీలంక ఆధీనంలోని పడవల సంఖ్య 56కు చేరింది. శ్రీలంక స్వాధీనంలో ఉన్న పడవలను కాంగేశన్, తలైమన్నార్ హార్బర్లలో పడవేయడంతో వాటిల్లో సముద్రపు నీరుచేరి మునిగిపోయే దశకు చేరుకున్నాయని తమిళ జాలర్లు ఆందోళన చెందుతున్నారు. చేపల వేట వృత్తి నుంచి తమను శాశ్వతంగా దూరం చేసేలా శ్రీలంక వ్యవహరిస్తోందని వారు ఆవేదనకు లోనవుతున్నారు. శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 38 మత్స్యకారులను, 36 పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెలో భాగంగా తమ వద్దనున్న పడవల ఆర్సీ బుక్కులను ఈనెల 28వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే ఆగస్ట్ 2వ తేదీన తమ వద్దనున్న సుమారు 14 వేల పడవల్లో తెల్లజెండాలు ఎగురవేసి మూకుమ్మడిగా కచ్చదీవులకు వెళ్లాలని నిర్ణయించారు. సమ్మె కారణంగా చేపల వేట స్తంభించి పోయింది. చిన్న, చిన్న చేపల వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. మత్స్య పరిశ్రమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. -
సమ్మె బాట
సాక్షి, చెన్నై:శ్రీలంక సేనలు కడలిలో మళ్లీ పంజా విసిరారు. 131 మందిని బందీలుగా పట్టుకెళ్లడంతో జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం నుంచి నిరవధిక సమ్మెకు జాలర్ల సంఘాలు పిలుపునిచ్చాయి. సముద్రంలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువు అయింది. యూపీఏ హయూంలో వ్యవహరించినట్టుగానే, ప్రస్తుతం కూడా శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించే పనిలో పడింది. కేంద్రంలో అధికారం మారడంతో తమ తలరాతలు మారతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. తమ మీద వరుస దాడులకు శ్రీలంక సేనలు ఒడిగడుతుండడంతో, ఇక తామేమిటోనన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపించేందుకు జాలర్లు సిద్ధం అయ్యారు. ఒకే రోజు రామనాథపురం, పుదుకోట్టై, రామేశ్వరం, పాంబన్, మండపంలకు చెందిన జాలర్లను శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో సమ్మె సైరన్ మోగించే పనిలో సంఘాలు పడ్డాయి. మళ్లీ పంజా: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరి పట్టుమని పది రోజులు అయిందో లేదో, ఐదు సార్లు శ్రీలంక సేనలు తమిళ జాలర్లపై తమ ప్రతాపం చూపించాయి. పట్టుకెళ్లిన వారిని కేంద్రం ఒత్తిడితో విడుదల చేయాల్సి వస్తుండడంతో రెండు రోజుల క్రితం లంక సేనలు తమ పంథాను మార్చాయి. కడలిలో కనిపించిన తమిళ జాలర్లను ఉతికి ఆరేసి పంపించాయి. ఈ ఘటన కడలిలో తమ భద్రతను ప్రశ్నార్థకం చేయడంతో జాలర్లలో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో శనివారం రామనాథపురం, పుదుకోట్టై, రామేశ్వరం, పాంబన్, మండపంలకు చెందిన జాలర్లు కడలిలోకి వెళ్లి తిరుగు పయనం కాలేదు. ఆదివారం ఉదయాన్నే వచ్చిన సమాచారంతో జాలర్లలో ఆగ్రహం రేగింది. 131 మంది బందీ: రామేశ్వరం, పాంబన్, మండపానికి చెందిన జాలర్లు ధనుస్కోడి - తలైమన్నార్ మధ్యలో వేటలో ఉండగా లంక సేనలు వీరంగం సృష్టించాయి. కొన్ని పడవల్లోని వారు అతి కష్టం మీద ఒడ్డుకు తిరుగు పయనం కాగానే, 45 మంది జాలర్లు వారి చేతికి చిక్కారు. పది పడవలను స్వాధీనం చేసుకుని ఆ జాలర్లను తమ దేశానికి పట్టుకెళ్లారు. రామనాథపురం జాలర్లు కాంగేయం సమీపంలో వేటలో ఉండగా వారిపై మరో లంక సేనల బృందం దాడి చేసింది. తొమ్మిది పడవలతోపాటుగా 53మందిని పట్టుకెళ్లింది. పుదుకోట్టై జాలర్లు నెడుందీవులకు సమీపంలో వేటలో ఉండగా వారిపై ఇంకో బృందం దాడి చేసి ఆరు పడవలతో పాటుగా 33 మందిని తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరందరినీ యాల్పానం, తలై మన్నార్ హార్బర్లలో బంధించినట్టు వచ్చిన సమాచారం జాలర్ల సంఘాల్లో ఆగ్రహాన్ని రేపింది. నిర్ణయం: రామేశ్వరంలో ఆగమేఘాలపై జాలర్ల సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. వేటను బహిష్కరిస్తూ సమ్మె బాటకు నిర్ణయించారు. రామనాధపురం, రామేశ్వరం, పాంబన్, మండపం పరిసరాల్లోని సముద్ర తీరాలకు పడవలు పరిమితం అయ్యాయి. ఉద్దేశ పూర్వకంగానే తమ మీద శ్రీలంక సేనలు దాడులు చేస్తున్నట్టుందని, తమకు భద్రత కల్పించే రీతిలో దాడులకు అడ్డుకట్ట వేసే వరకు కడలిలోకి వెళ్లబోమంటూ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జాలర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనకు చర్యలు తీసుకునేందుకు ఆ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, ఈనెల 11న నల్లగుడ్డను నోటికి చుట్టుకుని మౌన ప్రదర్శన చేయనున్నట్టు ప్రకటించారు. తూత్తుకుడి, కన్యాకుమారి, నాగపట్నం, కడలూరు తదితర జాలర్ల సంఘాలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే రీతిలో భారీ నిరసనకు సన్నద్ధం కాబోతున్నామని రామేశ్వరం జాలర్ల సంఘాలు మూకుమ్మడిగా ప్రకటించాయి. పీఎంకు లేఖాస్త్రం : లంక సేనల పంజాను తీవ్రంగా పరిగణించిన సీఎం జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ వాళ్లపై వరుసగా జరుగుతున్న దాడులను గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పడవలను శ్రీలంక తమ గుప్పెట్లోనే పెట్టుకుంటోందని గుర్తు చేస్తూ, దాడులకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లందరినీ విడుదల చేయించాలని, రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక చర్చలతో, దాడులకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తీరును టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తప్పుబట్టారు. ఇన్నాళ్లు తమ మీద నిందలు వేస్తూ వచ్చిన వాళ్లు ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తారంటూ ప్రశ్నించారు. దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా యూపీఏ సర్కారు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు ఉధృతం అవుతుండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
సమ్మె బాట!
సాక్షి, చెన్నై: రామేశ్వరం, పంబన్, ధనుస్కోడి జాలర్లు నిరవధిక సమ్మె బాట పట్టారు. ఆదివారం నుంచి చేపల వేటకు దూరంగా ఉండేందుకు నిర్ణయించారు. దీంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యాయి. కచ్చదీవుల్లో చేపల వేట రామేశ్వరం తీర జాలర్లకు దిన దిన గండంగా మారింది. శ్రీలంక పైశాచికత్వానికి ఆ తీర జాలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబ పెద్దలను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిషేధిత వలలతో చేపల్ని వేటాడడం వల్లే పట్టకెళ్తున్నామని శ్రీలంక అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో నిషేధిత వలలను ఉపయోగించే రాష్ట్ర జాలర్లపై కొరడా ఝుళిపించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే, శ్రీలంకలో నిషేధం ఉన్న వలలను ఇక్కడ ఉపయోగించకూడదని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని రాష్ట్ర జాలర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉపయోగించే వలలు వేరు, అక్కడ ఉపయోగించే వలలు వేరు అని సూచిస్తున్నారు. శ్రీలంక నావికాదళానికి తోడుగా రాష్ట్ర అధికారులూ తమను వేధించడంతో రామేశ్వరం, పంబన్, ధనుస్కోడి, రామనాథపురం తీర జాలర్లు సమ్మె బాట పట్టారు. చేపల వేటను నిషేధించారు. 90 శాతానికి పైగా జాలర్లు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వలల ద్వారానే చేపలను వేటాడుతున్నారని, ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం మంచి పద్ధతి కాదని, అందుకే నిరవధిక సమ్మెకు దిగుతున్నామని ఆదివారం ప్రకటించారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయాలని, అధికారులు వేధింపులు మానుకోవాలన్న డిమాండ్‌తో జాలర్లు చేపల వేటకు దూరంగా ఉండటంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈనెల 12న భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామని జాలర్ల సంఘాలు ప్రకటించాయి. తమ కుటుంబం కార్డులను, ఓటరు గుర్తింపు కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నామని, ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపారు. ఈనెల 13న కొలంబో వేదికగా జరిగే చర్చల ద్వారా తమకు అనుకూలంగా నిర్ణయాలు, ఒప్పందాలు లేని పక్షంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.