
ఆగిన వేట
తమిళ జాలర్లపై శ్రీలంక దాష్టీకాన్ని నిరసిస్తూ రామనాథపురం, జగదాపట్నానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. 15 వేల మంది జాలర్లు సమ్మెలో పాల్గొనగా 14 వేల పడవలు ఒడ్డునే ఉండిపోయాయి. చేపలవేట దాదాపు స్తంభించిపోయింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ జాలర్లు శుక్రవారం నుంచి సమ్మెసైరన్ మోగించారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న 56 పడవలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడాదికి ఒకసారి అమలుచేసే చేపల వేట నిషేధం తొలగిపోయిన నాటి నుంచి జాలర్లపై శ్రీలంక దళాలు దాడులు సాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల చేపల వేటకెళ్లిన రామేశ్వరం, పంబన్, మండపం, జగదాపట్నం, నాగపట్నం ప్రాంతాలకు చెందిన 200 మంది జాలర్లను శ్రీలంక గస్తీ దళాలు నడి సముద్రంలోనే బందించాయి. వారు ప్రయాణించిన పడవలను స్వాధీనం చేసుకున్నాయి.
జాలర్లను శ్రీలంక జైళ్లలోకి తోసేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడితో లంక సైన్యం మెత్తబడింది. కొందరు జాలర్లను మాత్రమే విడిచిపెట్టారు. అయితే వారి జీవనాధారమైన పడవలను మాత్రం స్వాధీనంలోనే ఉంచుకున్నారు. ఇటీవల రామేశ్వరం, జగదాపట్నంకు చెందిన 38 మంది మత్స్యకారులను శ్రీలంక సైన్యం అరెస్ట్ చేసింది. వారి నుంచి 9 పడవలను స్వాధీనం చేసుకుంది. దీంతో శ్రీలంక ఆధీనంలోని పడవల సంఖ్య 56కు చేరింది. శ్రీలంక స్వాధీనంలో ఉన్న పడవలను కాంగేశన్, తలైమన్నార్ హార్బర్లలో పడవేయడంతో వాటిల్లో సముద్రపు నీరుచేరి మునిగిపోయే దశకు చేరుకున్నాయని తమిళ జాలర్లు ఆందోళన చెందుతున్నారు.
చేపల వేట వృత్తి నుంచి తమను శాశ్వతంగా దూరం చేసేలా శ్రీలంక వ్యవహరిస్తోందని వారు ఆవేదనకు లోనవుతున్నారు. శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 38 మత్స్యకారులను, 36 పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెలో భాగంగా తమ వద్దనున్న పడవల ఆర్‌సీ బుక్కులను ఈనెల 28వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు.
ఈ నెలాఖరులోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే ఆగస్ట్ 2వ తేదీన తమ వద్దనున్న సుమారు 14 వేల పడవల్లో తెల్లజెండాలు ఎగురవేసి మూకుమ్మడిగా కచ్చదీవులకు వెళ్లాలని నిర్ణయించారు. సమ్మె కారణంగా చేపల వేట స్తంభించి పోయింది. చిన్న, చిన్న చేపల వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. మత్స్య పరిశ్రమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.