సమ్మె బాట | Fishermen Strike in Chennai | Sakshi
Sakshi News home page

సమ్మె బాట

Published Sun, Jun 8 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

Fishermen Strike in Chennai

సాక్షి, చెన్నై:శ్రీలంక సేనలు కడలిలో మళ్లీ పంజా విసిరారు. 131 మందిని బందీలుగా పట్టుకెళ్లడంతో జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం నుంచి నిరవధిక సమ్మెకు జాలర్ల సంఘాలు పిలుపునిచ్చాయి. సముద్రంలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువు అయింది. యూపీఏ హయూంలో వ్యవహరించినట్టుగానే, ప్రస్తుతం కూడా శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించే పనిలో పడింది. కేంద్రంలో అధికారం మారడంతో తమ తలరాతలు మారతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. తమ మీద వరుస దాడులకు శ్రీలంక సేనలు ఒడిగడుతుండడంతో, ఇక తామేమిటోనన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపించేందుకు జాలర్లు సిద్ధం అయ్యారు. ఒకే రోజు రామనాథపురం, పుదుకోట్టై, రామేశ్వరం, పాంబన్, మండపంలకు చెందిన జాలర్లను శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో సమ్మె సైరన్ మోగించే పనిలో సంఘాలు పడ్డాయి.
 
 మళ్లీ పంజా: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరి పట్టుమని పది రోజులు అయిందో లేదో, ఐదు సార్లు శ్రీలంక సేనలు తమిళ జాలర్లపై తమ ప్రతాపం చూపించాయి. పట్టుకెళ్లిన వారిని కేంద్రం ఒత్తిడితో విడుదల చేయాల్సి వస్తుండడంతో రెండు రోజుల క్రితం లంక సేనలు తమ పంథాను మార్చాయి. కడలిలో కనిపించిన తమిళ జాలర్లను ఉతికి ఆరేసి పంపించాయి. ఈ ఘటన కడలిలో తమ భద్రతను ప్రశ్నార్థకం చేయడంతో జాలర్లలో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో శనివారం రామనాథపురం, పుదుకోట్టై, రామేశ్వరం, పాంబన్, మండపంలకు చెందిన జాలర్లు కడలిలోకి వెళ్లి తిరుగు పయనం కాలేదు. ఆదివారం ఉదయాన్నే వచ్చిన సమాచారంతో జాలర్లలో ఆగ్రహం రేగింది.
 
 131 మంది బందీ: రామేశ్వరం, పాంబన్, మండపానికి చెందిన జాలర్లు ధనుస్కోడి - తలైమన్నార్ మధ్యలో వేటలో ఉండగా లంక సేనలు వీరంగం సృష్టించాయి. కొన్ని పడవల్లోని వారు అతి కష్టం మీద ఒడ్డుకు తిరుగు పయనం కాగానే, 45 మంది జాలర్లు వారి చేతికి చిక్కారు. పది పడవలను స్వాధీనం చేసుకుని ఆ జాలర్లను తమ దేశానికి పట్టుకెళ్లారు. రామనాథపురం జాలర్లు కాంగేయం సమీపంలో వేటలో ఉండగా వారిపై మరో లంక సేనల బృందం దాడి చేసింది. తొమ్మిది పడవలతోపాటుగా  53మందిని పట్టుకెళ్లింది. పుదుకోట్టై జాలర్లు నెడుందీవులకు సమీపంలో వేటలో ఉండగా వారిపై ఇంకో బృందం దాడి చేసి ఆరు పడవలతో పాటుగా 33 మందిని తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరందరినీ యాల్పానం, తలై మన్నార్ హార్బర్లలో బంధించినట్టు వచ్చిన సమాచారం జాలర్ల సంఘాల్లో ఆగ్రహాన్ని రేపింది.
 
 నిర్ణయం: రామేశ్వరంలో ఆగమేఘాలపై జాలర్ల సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. వేటను బహిష్కరిస్తూ సమ్మె బాటకు నిర్ణయించారు. రామనాధపురం, రామేశ్వరం, పాంబన్, మండపం పరిసరాల్లోని సముద్ర తీరాలకు పడవలు పరిమితం అయ్యాయి. ఉద్దేశ పూర్వకంగానే తమ మీద శ్రీలంక సేనలు దాడులు చేస్తున్నట్టుందని, తమకు భద్రత కల్పించే రీతిలో దాడులకు అడ్డుకట్ట వేసే వరకు కడలిలోకి వెళ్లబోమంటూ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జాలర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనకు చర్యలు తీసుకునేందుకు ఆ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, ఈనెల 11న నల్లగుడ్డను నోటికి చుట్టుకుని మౌన ప్రదర్శన చేయనున్నట్టు ప్రకటించారు. తూత్తుకుడి, కన్యాకుమారి, నాగపట్నం, కడలూరు తదితర జాలర్ల సంఘాలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే రీతిలో భారీ నిరసనకు సన్నద్ధం కాబోతున్నామని రామేశ్వరం జాలర్ల సంఘాలు మూకుమ్మడిగా ప్రకటించాయి.
 
 పీఎంకు లేఖాస్త్రం : లంక సేనల పంజాను తీవ్రంగా పరిగణించిన సీఎం జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ వాళ్లపై వరుసగా జరుగుతున్న దాడులను గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పడవలను శ్రీలంక తమ గుప్పెట్లోనే పెట్టుకుంటోందని గుర్తు చేస్తూ, దాడులకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. శ్రీలంక చెరలో  ఉన్న తమిళ జాలర్లందరినీ విడుదల చేయించాలని, రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక చర్చలతో, దాడులకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.  కేంద్రం తీరును టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తప్పుబట్టారు. ఇన్నాళ్లు తమ మీద నిందలు వేస్తూ వచ్చిన వాళ్లు ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తారంటూ ప్రశ్నించారు. దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా యూపీఏ సర్కారు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు ఉధృతం అవుతుండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement