ఆ 5 రంగాలూ... కుదేలు
సాక్షి ప్రతినిధి,విజయనగరం: తుపాను ధాటికి జిల్లాలో ఐదు రంగాలు కుదేలయ్యాయి. ఈ రంగాలపై ఆధారపడిన ప్రజలు తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆ రంగాలు ఎన్నాళ్లకి సాధారణ స్థితికి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, రహదారులు, మత్స్యకార రంగాలు హుదూ ద్ తుపాను ప్రళయ గర్జనకు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆయా రంగాలపై ఆధారపడిన, ఉపాధి పొందుతున్న వర్గాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయి. విద్యుత్ శాఖ కోట్లాది రూపాయలు నష్టపోయినట్టే.. దాన్ని నమ్ముకుని ఉపాధి పొందుతున్న వారు కూడా ఇక్కట్లుఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా లేక చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల యజమానుల వరకూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. తుపాను బీభత్సానికి మూడు రోజుల్లో విద్యుత్ శాఖకు చెందిన 10 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అలాగే 520 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో విద్యుత్ శాఖ తీవ్రంగా నష్టపోయింది. తుపాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా.. నష్టాలు, కష్టాలు వెంటాడుతున్నాయి.
హుదూద్ తీరం దాటి నాలుగు రోజులవుతున్నా ఇంకా జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా చరిత్రలో ఇన్ని రోజులు అంధకారం నెలకొన్న సందర్భాలు లేవు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులతో పాటు ఆస్పత్రుల్లో ఉన్న రోగులు అష్టకష్టాల పాలవుతున్నారు . మరో ప్రధాన సమస్య తాగునీరు. తుపాను తీవ్రతకు జిల్లాలో 175 ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పలు ప్రధాన పథకాలు కూడా మొరాయించాయి. దీని వల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో ఉన్న పలు గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రైవేటు మంచినీటి వర్తకులు బాటిళ్లు, కేన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. మరోపక్క మంచినీరు అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నా లభించకపోవడం విచారకరం. దీంతో హొటళ్లు, టీ దుకాణాలు, ఐస్ తయారీ పరిశ్రమలు ఇలా నీటి ఆధారంగా నడుస్తున్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
ఇక జిల్లాలో 80 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. వరి పంటకు కొంత వరకూ పరవాలేదు కానీ మిగతా పంటలన్నీ తుపాను దెబ్బకు తీవ్రంగా పోయూరుు. జిల్లాలో ఉద్యాన, వాణిజ్య పంటలన్నీ దెబ్బతిన్నాయి. 80 వేల హెక్టార్లలో వరి, చెరకు, మొక్కజొన్న, కొబ్బరి, అరటి వంటి పంటలు నేలకొరిగి, నీటి పాలయ్యాయి. దీంతో రైతులు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా సాగునీటి రంగంలో దాదాపు వెయ్యి నీటి వనరులు దెబ్బ తిన్నాయి. ఇప్పటికే పలు సాగునీటి వనరులకు నిర్వహణ నిధుల్లేక కునారిల్లుతున్న సమయంలో ఇలా హుదూద్ తుపాను ధాటికి ఉన్న కొద్ది పాటి వనరులూ పాడయ్యాయి. దీంతో రైతాంగం తీవ్ర నష్టాల పాలైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రతి రహదారిలోనూ భారీ ఎత్తున వృక్షాలు, చెట్లు కూలిపోయాయి. హైవేలు తప్ప ఇప్పటికీ చాలా రహదారుల్లో కూలిపోయిన చెట్లను ఇంకా తొలగించలేకపోతున్నారంటే పరిస్థితి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 484 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి.
అదేవిధంగా 325 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు పాడైపోయాయి. 36 మున్సిపల్ రహదారులు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో అన్ని రంగాల వారూ తీవ్ర ఇబ్బందులతో పాటు నష్టాన్ని కూడా భారీగా చవిచూడాల్సి వస్తోంది. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయం! జిల్లాలో ఉన్న మత్స్యకారులు ఏటా తుపానులకు నష్టపోతున్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ, ఏర్పాట్లు చేయడంలోనూ ఏటా యంత్రాంగం విఫలమవుతోంది. వారికి అవసరమయిన షెల్టర్లు దెబ్బతిన్నాయి. కొత్త ప్రతిపాదనలు బుట్టదాఖలా అవుతున్నాయి తప్ప పరిష్కారమార్గాలు కనుగొనలేకపోతున్నారు. తుపాను ధాటికి 1270 వలలు సముద్రం పాలయ్యాయి. అలాగే 363 బోట్లు కొట్టుకు పోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పలువురు ఉపాధి కోల్పోయారు. ఇన్ని రంగాల్లోనూ నష్టాలు భారీగా ఉన్నా నిత్యం వచ్చే తుపానులు,భారీ వర్షాలకు ఇళ్లు కూడా భారీగానే దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 14వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలకు ఎంతో సమయం పడుతుంది.