five children
-
ఫ్రిజ్‌లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి
కేప్‌టౌన్: ఆడుకుంటూ ఫ్రిజ్‌లో దాక్కున్న ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఆఫ్రికాలోని కకామస్లో చోటు చేసుకుంది. వరుసకు సోదరులైన చిన్నారులందరూ మూడు ఏళ్ల నుంచి ఏడేళ్ల మధ్య వయసు వారే. పిల్లల నాయనమ్మ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడంతో చిన్నారులు మరణించిన విషయం బయటకు వచ్చింది. ఫ్రిజ్ డోర్ లాక్ అవడంతో అందులోనే ఇరుక్కొని గాలి ఆడక చిన్నారులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాపం.. పసివాళ్లు..
మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన గంట తిప్పమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేత సంబంధం కొనసాగిస్తోంది. తన బంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి.. గతేడాది మార్చిలో పథకం ప్రకారం భర్త సోమన్నను హత్యచేయించింది. ఎవరికీ ఆనవాళ్లు లభించకుండా ఓ పాడుబావిలో శవాన్ని పడేసింది. తన భర్త కనిపించడం లేదని.. ఎక్కడో వెళ్లిపోయాడని గ్రామస్తులను నమ్మించింది. తిరిగి ఐదునెలల తర్వాత సోమన్న చనిపోయాడని తెలిసి.. పోలీసులు విచారణ జరిపి తిప్పమ్మను నిందితురాలుగా చేర్చడంతో కటకటాల పాలైంది. ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆమెకు పిల్లల పెంపకం భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తిచెంది మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులు లావణ్య(10), శేఖర్(08), జ్యోతి(6), సోని(4), శోభ(3).. తల్లి కూడా మృతిచెందడంతో దిక్కులేని వారయ్యారు. ఆ చిన్నారులంతా పసిమొగ్గలే.. పట్టుమని పదేళ్లు కూడా దాటకపోవడంతో వారి ఆలనాపాలనా చూసుకునేవారు కరువైపోయారు. ప్రస్తుతం ఆ చిన్నారులంతా చిన్నాన్న గాలెప్ప వద్ద ఉంటున్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఐదుగురు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి
వాషింగ్టన్: కన్న తండ్రే పిల్లల పాలిట కసాయిగా మారాడు. అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు జోన్స్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైవేలో పోలీసులు జోన్స్ కారును తనిఖీ చేసినపుడు అందులో రక్తపు మరకలు, పిల్లల దుస్తులు కనిపించాయి. వారం రోజుల క్రితం పిల్లలు కనిపించడం లేదని జోన్స్ నుంచి విడాకులు తీసుకున్న అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జోన్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే పిల్లలను హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హైవే సమీపంలో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. పిల్లలను హత్య చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 2001లో జోన్స్‌పై కారు దొంగతనం, కొకైన్ సరఫరా కేసులు నమోదయ్యాయి.