4 గంటలు.. 300 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు. ప్రకటించిన తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇక అప్పటినుంచి ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలుండదు. అందుకే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జాగ్రత్త పడ్డారు. కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో.. ఒక ఐటీ సిటీ, కేన్సర్ ఆస్పత్రి, ఒలింపిక్స్ సైజు స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటినీ ఆవిష్కరించారు. ఇంతకుముందు ఎక్కడా, ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి ఏకంగా 50 వేల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎడాపెడా చేసిపారేశారు. 100 ఎకరాల్లో ఐటీ సిటీ, 983 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి, 850 కోట్లతో అంతర్జాతీయ కేంద్రం.. వీటన్నింటి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
గత నెలలోనే లక్నో నుంచి ఆగ్రా వరకు 302 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను ఆయన ప్రారంభించారు. అయితే 10 వేల కోట్ల విలువైన ఆ ప్రాజెక్టు ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. లక్నో మెట్రో మొదటి దశ ట్రయల్ రన్ను ఆయన ప్రారంభించారు గానీ, అది జనానికి అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై ఆయన మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు వల్ల మనం బాగా వెనకబడిపోయామని, యూపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతూ.. ఒక్కసారిగా అంతా ఆగిపోయిందని అన్నారు. ప్రజలకు డబ్బులు అందట్లేదని, దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.