float festival
-
వైభవంగా కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాలు
సాక్షి, తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి తెప్పోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖరస్వమి వారు తెప్పలను అధిరోహించి విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీవినాయకస్వామి, రెండవ రోజు శ్రీసుబ్రమణ్యస్వామి, మూడవ రోజు శ్రీసోమస్కందమూర్తి, నాల్గవ రోజు శ్రీకామాక్షి అమ్మవారు తెప్పలపై కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ముగింపు సందర్భంగా శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖర స్వామి సర్వాంగ సుందర అలంకరణ ప్రియులై తెప్పలపై కొలువు తీరి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుమధుర భక్తి సంకీర్తనలను గానం చేసి భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో శంకర్రాజు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం ఆరుద్ర దర్శన మహోత్సవంలో సందర్భంగా ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీనటరాజస్వామి, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీమాణిక్య వాసగ స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఘనంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. -
నేత్రానందం తెప్పోత్సవం
– పాల్గొన్న వేలాది మంది భక్తులు –– ధర్మకర్తల మండలి సభ్యులకు దక్కని అవకాశం శ్రీకాళహస్తి : సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవం శుక్రవారం రాత్రి శ్రీకాళహస్తిలో వేడుకగా జరిగింది. ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఇంద్రవిమానంపై ఊరేగిన శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి రాత్రి పట్టణంలోని నారదపుష్కరిణిలో తెప్పలపై తిరుగాడారు. కుమారస్వామి కొండకు దిగువభాగంలో ఉన్న నారదపుష్కరిణిలో తెప్పలను పూలతో, మామిడి తోరణాలతో,అరటిచెట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్దీప కాంతులతో మెరిసిపోతున్న తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించారు. కోనేరులో స్వామి అమ్మవారు తెప్పలపై ఆరు సార్లు ప్రదక్షిణలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఉత్సవాన్ని తిలకించారు. భక్తులు కోనేరులో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించకున్నారు. మరికొందరు భక్తులు బెల్లం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు,ఈవో భ్రవురాంబ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టవేలు జయగోపాల్, పీఎం చంద్ర, ఉభయదారులు పాల్గొన్నారు. తెప్పలపై ఆలయ చైర్మన్ దంపతులు,ఈవో, ఇద్దరు అర్చకులు, ఇద్దరు వేద పండితులు అవకాశం లభించింది. ఏడుగురు మాత్రమే తెప్పలపై ఎక్కడానికి వీలుందని ఇరిగేషన్ అధికారులు ముందే సూచించారు. దీంతో ఆలయ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.