టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు.
ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది.
‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం.
పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు.
ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి.
ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు!
పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని.
ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను.
వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే.
ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది.
నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి.
ఫ్లోరైడ్ జవాబు దొరికింది!
నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం.
– కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది.
– వాకా మంజులారెడ్డి