ప్రధాని కాన్వాయ్‌పై పూలకుండీ
రోడ్డుపై విసిరేసి పారిపోయిన మహిళ ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని రాజ్‌పథ్.. బుధవారం మధ్యాహ్నం 2.10 గంటలు.. సౌత్‌బ్లాక్ నుంచి బయల్దేరేందుకు ప్రధాని కాన్వాయ్ రెడీ అయింది.. పోలీసులు ఆ దారిని తమ అధీనంలోకి తీసుకున్నారు.. రోడ్లపై ఎక్కడివారిని అక్కడే ఆపేశారు.. ఇంతలో ఓ మహిళ ఉన్నట్టుండి పూలకుండీ తీసి రోడ్డుపై విసిరికొట్టి అక్కడ్నుంచి పారిపోయింది! కొద్ది సెకన్ల తర్వాత అదే మార్గం గుండా ప్రధాని కారు వెళ్లింది!! ఈ హఠాత్పరిణామం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వెంటనే తేరుకున్న భద్రతాసిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఆ మహిళను ఉత్తరప్రదేశ్‌లోని షాహిబాబాద్‌కు చెందిన నీనా రావల్‌గా గుర్తించారు.
ప్రధాని కాన్వాయ్ నేపథ్యంలో విజయ్‌చౌక్ వద్ద జనాన్ని ఆపారు. వారిలో నీనా ముందు వరుసలో ఉన్నారు. ‘కాస్త పక్కకు తప్పుకోవమ్మా..’ అని భద్రతా సిబ్బంది గద్దించడంతో ఆమె ఆగ్రహంతో మూడు బ్యారికేడ్లను తోసేసింది. తర్వాత రైజినా హిల్స్ వైపు పరుగెత్తి అక్కడే ఉన్న ఓ పూలకుండీ తీసి రోడ్డుపై విసిరేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రధాని కాన్వాయ్ వెళ్లింది. విజయ్‌చౌక్ వద్దే ఆమెను అదుపులోకి తీసుకొని ఉండాల్సిందని డీసీపీ జతిన్ నర్వాల్ పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించామని, అనంతరం ప్రశ్నించామని డీసీపీ వివరించారు.
తన ఊరిలో కొందరు దుండగులు తన మార్కుల పత్రాన్ని చించేసి, వేధించారని నీనా పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు పేర్కొంది. ఆ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారో తెలుసా అని అడగ్గా తెలియదని సమాధానమిచ్చింది. ఎవరిని కలిసేందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.