నేరగాళ్లకు కఠిన శిక్షలు లఖ్‌పతి దీదీ సమ్మేళన్‌లో మోదీ
జల్‌గావ్: మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల జోలికి రావొద్దని మృగాళ్లను హెచ్చరించారు. పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతాలో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు.
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఆదివారం ‘లఖ్‌పతి దీదీ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది మహిళల కోసం రూ.2,500 కోట్ల రివాలి్వంగ్ ఫండ్ విడుదల చేశారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మోదీ ఇంకా ఏమన్నారంటే...
మహిళల భద్రత అందరి బాధ్యత
‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను కాపాడుకోవాలి. వారి భద్రత దేశానికి ప్రాధాన్యతాంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్లినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరీమణులు, తల్లులు పడుతున్న బాధలు, ఆవేదన నాకు తెలుసు. మహిళలపై నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించేవారిని సైతం విడిచిపెట్టొద్దు. అది ఆసుపత్రి గానీ, పాఠశాల గానీ, ప్రభుత్వ ఆఫీసు గానీ, పోలీసు స్టేషన్ గానీ.. ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మహిళల జీవితాలను, గౌరవాన్ని కాపాడడం మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం, ప్రభుత్వాల బాధ్యత.
పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల రుణాలు
గత పదేళ్ల పరిపాలనలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. పథకాలు అమలు చేశాం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 2014 వరకూ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పటి ప్రభుత్వాలు ఇచి్చన రుణాలు రూ.25,000 కోట్ల కంటే తక్కువే. కానీ, మేమొచ్చాక గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం. సఖి మండల్ కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. లఖ్‌పతి దీదీ పథకంతో మహిళల ఆదాయం పెరగడంతోపాటు భవిష్యత్తు తరాల సాధికారత సాధ్యమవుతుంది. మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.
ఇందులో మహిళామణుల పాత్ర చాలా కీలకం. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యంతో దేశం ముందంజ వేస్తోంది. ప్రతి ఇంట్లో, పత్రి కుటుంబంలో సౌభాగ్యానికి మహిళలే గ్యారంటీ. కానీ, మహిళలకు సాయపడడానికి గ్యారంటీ ఇచ్చేవాళ్లు లేరు. మహిళల పేరిట ఆస్తులేవీ లేకపోతే వారికి బ్యాంకుల నుంచి రుణాలు రావడం కష్టమే. చిన్న వ్యాపారం చేసుకుందామన్నా రుణం దొరకడం లేదు. ఒక సోదరుడిగా, బిడ్డగా మహిళల కష్టాలను అర్థం చేసుకున్నా. వారి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా.
రెండు నెలల్లో 11 లక్షల మంది లఖ్‌పతి దీదీలు
ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాం. మహిళల పేరిట జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. ముద్ర పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందుతున్నాయి. ఈ పథకంలో 70 శాతం మంది లబి్ధదారులు మహిళలే. ఈ పథకం వద్దని, రుణాలు తిరిగిరావని కొందరు వాదించారు. అయినప్పటికీ మహిళల పట్ల, వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తుండడం సంతోషం కలిగిస్తోంది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాం. 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఎన్నికల సమయంలో మాటిచ్చా.
మహిళాస్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నవారంతా లక్షాధికారులైనట్లే. గత పదేళ్లలో కోటి మంది లఖ్‌పతి దీదీలను తయారు చేశాం. కేవలం రెండు నెలల్లో కొత్తగా 11 లక్షల మంది లఖ్‌పతి దీదీలు అయ్యారు. వీరిలో లక్ష మంది మహారాష్ట్ర మహిళలే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మహారాష్ట్ర ఒక షైనింగ్ స్టార్’’ అని మోదీ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment