women protection
-
మహిళలపై నేరం.. క్షమించరాని పాపం
జల్గావ్: మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల జోలికి రావొద్దని మృగాళ్లను హెచ్చరించారు. పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతాలో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు.మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం ‘లఖ్పతి దీదీ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది మహిళల కోసం రూ.2,500 కోట్ల రివాలి్వంగ్ ఫండ్ విడుదల చేశారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మోదీ ఇంకా ఏమన్నారంటే...మహిళల భద్రత అందరి బాధ్యత ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను కాపాడుకోవాలి. వారి భద్రత దేశానికి ప్రాధాన్యతాంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్లినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరీమణులు, తల్లులు పడుతున్న బాధలు, ఆవేదన నాకు తెలుసు. మహిళలపై నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించేవారిని సైతం విడిచిపెట్టొద్దు. అది ఆసుపత్రి గానీ, పాఠశాల గానీ, ప్రభుత్వ ఆఫీసు గానీ, పోలీసు స్టేషన్ గానీ.. ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మహిళల జీవితాలను, గౌరవాన్ని కాపాడడం మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం, ప్రభుత్వాల బాధ్యత.పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల రుణాలు గత పదేళ్ల పరిపాలనలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. పథకాలు అమలు చేశాం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 2014 వరకూ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పటి ప్రభుత్వాలు ఇచి్చన రుణాలు రూ.25,000 కోట్ల కంటే తక్కువే. కానీ, మేమొచ్చాక గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం. సఖి మండల్ కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. లఖ్పతి దీదీ పథకంతో మహిళల ఆదాయం పెరగడంతోపాటు భవిష్యత్తు తరాల సాధికారత సాధ్యమవుతుంది. మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.ఇందులో మహిళామణుల పాత్ర చాలా కీలకం. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యంతో దేశం ముందంజ వేస్తోంది. ప్రతి ఇంట్లో, పత్రి కుటుంబంలో సౌభాగ్యానికి మహిళలే గ్యారంటీ. కానీ, మహిళలకు సాయపడడానికి గ్యారంటీ ఇచ్చేవాళ్లు లేరు. మహిళల పేరిట ఆస్తులేవీ లేకపోతే వారికి బ్యాంకుల నుంచి రుణాలు రావడం కష్టమే. చిన్న వ్యాపారం చేసుకుందామన్నా రుణం దొరకడం లేదు. ఒక సోదరుడిగా, బిడ్డగా మహిళల కష్టాలను అర్థం చేసుకున్నా. వారి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా.రెండు నెలల్లో 11 లక్షల మంది లఖ్పతి దీదీలు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాం. మహిళల పేరిట జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. ముద్ర పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందుతున్నాయి. ఈ పథకంలో 70 శాతం మంది లబి్ధదారులు మహిళలే. ఈ పథకం వద్దని, రుణాలు తిరిగిరావని కొందరు వాదించారు. అయినప్పటికీ మహిళల పట్ల, వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తుండడం సంతోషం కలిగిస్తోంది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాం. 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఎన్నికల సమయంలో మాటిచ్చా.మహిళాస్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నవారంతా లక్షాధికారులైనట్లే. గత పదేళ్లలో కోటి మంది లఖ్పతి దీదీలను తయారు చేశాం. కేవలం రెండు నెలల్లో కొత్తగా 11 లక్షల మంది లఖ్పతి దీదీలు అయ్యారు. వీరిలో లక్ష మంది మహారాష్ట్ర మహిళలే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మహారాష్ట్ర ఒక షైనింగ్ స్టార్’’ అని మోదీ కొనియాడారు. -
కువైట్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూత
కడప కార్పొరేషన్: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూతనందించింది. వివరాలిలా ఉన్నాయి.. వెంపటపు ప్రశాంతి అనే మహిళ జీవనోపాధి కోసం 2020లో కువైట్‌కు వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ప్రతినెలా జీతం పంపుతూ, కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఇటీవల తన వీసా గడువు ముగిసినా ఇండియాకు పంపకపోవడంతో ఆమె ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సాయం చేయమని అభ్యర్థించింది. స్పందించిన ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ మహేశ్వర్‌రెడ్డి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, ఆమెకు 10 రోజుల పాటు ఉచితంగా వసతి కల్పించటంతోపాటు తిరిగి ఇండియాకు తీసుకురావటానికి అవసరమైన పేపర్ వర్క్ అంతా పూర్తి చేయించారు. దీంతో ఆమె సోమవారం క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ.. తాను ఇండియాకు తిరిగి రావటానికి సాయపడిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, సీఈవో దినేష్‌కుమార్, డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి, ఎన్.మహేశ్వర్‌రెడ్డి, భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీస్ సేవల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్ తరహా సేవలకు వినియోగిస్తున్నారు. వీరి ద్వారా కూడా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా వీరు పోలీసులకు సమాచారం ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ఏం చేస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 మహిళా సంరక్షణ కార్యదర్శులున్నారు. వీరి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వీరు వారధుల్లా పనిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి పోలీస్ తరహా సేవలందించేలా వీరిని తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్(ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) పద్ధతి అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయాల్లో వీరి ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామాలు, వార్డుల్లో జరిగే అనేక విషయాలను వీరు పోలీస్‌స్టేషన్‌కు నివేదిస్తారు. అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా ఎప్పటికప్పుడు వీరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిస్తారు. అంతేకాదు, మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, మానవ అక్రమ రవాణా నిరోధం, మహిళల భద్రత, రహదారి భద్రత, సైబర్ భద్రత, బాల్య వివాహాలను అరికట్టేందుకు, రైతు ఆత్మహత్యల నిరోధంలో వీరు తమ వంతు పాత్ర పోషిస్తారు. వీటితో పాటు ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వాముల్ని చేస్తున్నారు. వీరి ద్వారా పోలీస్ సేవలు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పోలీస్ సేవలను అందించేలా మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే వారికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) ద్వారా శిక్షణ ఇచ్చాం. శాంతిభద్రతల నిర్వహణలో పలు అంశాలపై ప్రాథమికంగా వీరికి అవగాహన కల్పించాం. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని డిజిటల్ (ఆన్లైన్) సేవలను గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్‌తో మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటున్నాం. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చదవండి: లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు సిగ్గుంటే రాజీనామా చెయ్.. -
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి
సాక్షి, బిక్కవోలు(తూర్పు గోదావరి): సాంకేతికంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నా దేశంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండాపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు స్త్రీ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. హత్యలే వీటికి కారణం, చట్టాలు పటిష్టంగా ఉన్నా నిందితులకు శిక్షలు సత్వరం పడేలా చేసినప్పుడే అందరికీ భయం ఉంటుందని మహిళాలోకం అభిప్రాయపడుతోంది. చట్టాల గురించి మహిళలంతా తెలుసుకుని ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆపదలో ఉన్న సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లు, 100, 1098, 112 ఏ విధంగా ఉపయోగపడతాయి.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అనే విషయం యువతకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం సహాయం అందిస్తాం అమ్మాయిలు కూడా ఆత్మ విశ్వాసంతో పాటు, ఆత్మరక్షణ పద్ధతులను కచ్చితంగా నేర్చుకోవాలి. చట్టం పరమైన సహాయం అందించడానికి ముందుగా ఉంటాము. సెల్‌ఫోన్ అవసరమైనపుడు తప్ప ఎక్కువగా ఉపయోగించరాదు. – ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, బిక్కవోలు మంచి చెడులు చెప్పాలి తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుంచే మంచీ చెడుల గురించి చెప్తుండాలి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తిరిగి వచ్చే సమయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. సమాజంలో జరిగే పరిస్థితులను ఎప్పుటికప్పుడు వివరిస్తుండాలి. పిల్లలు బయటకు వెళ్లిన సమయంతో ఎప్పటికçప్పుడు సమాచారం ఇచ్చేలా పిల్లలకు అవగాహన కలి్పంచాలి. ఏదైనా ఆపద సమయంలో పోలీసు వారి హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే సృందించడం జరుగుతుంది. – పి.వాసు, ఎస్సై, బిక్కవోలు యువతులు మోసపోవద్దు నైతికత లేని కుటుంబాల నుంచి వచ్చినవారు.. పర్సనాలిటీ సమస్యలు కలిగిన పిల్లలు.. పెద్దల్లో లైంగిక వాంఛలు ఎక్కువగా ఉండటం వల్ల వారి కోరికలు తీర్చుకోవడానికి దేనికైనా తెగిస్తారు. మగవారి రూపాన్ని చూసి, మాటలు పొగడ్తలను చూసి యువతులు మోసపోవద్దు. ఎవరి జాగ్రత్తలు, హద్దుల్లో వారుండాలి. జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలను గుర్తుంచుకోవాలి. – శివాజీ, పీహెచ్సీ వైద్యుడు, కొంకుదురు మహిళలంతా అప్రమత్తంగా ఉండాలి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లోను ముందుంటున్నారు. వృత్తి ధర్మంలో భాగంగా బయటకు వెళ్లే మహిళలపై జరిగే దాడులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆత్మరక్షణ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలు, శిక్షలపై మెళకువ కలిగి ఉండాలి. – కేటికే పద్మశ్రీ, సచివాలయ కార్యదర్శి, పందలపాక తల్లిదండ్రులు గమనించాలి యువతీ యువకుల ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటి వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు వినియోగించే ఫోన్లను వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో గమనిస్తుండాలి. దీంతో పాటు పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా హుందాగా వ్యవహరించాలి. – మట్టపర్తి అనుపమ, ఎంపీడీవో, బిక్కవోలు -
నిర్భయ చట్టం అమల్లోకొచ్చినా.. భయమే!
మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లు... యావత్ ప్రపంచం సిగ్గుపడేలా ఢిల్లీ నడివీధుల్లో నిర్భయపై జరిగిన అత్యాచారానికి మరో నెలరోజుల్లో ఏడేళ్ళు నిండుతాయి. నిర్భయ ఉదంతం ఈ దేశంలో స్త్రీల భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది. నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన యువతరం ఉద్యమం నిర్భయ చట్టానికి ప్రాణం పోసింది. పసివారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చిన్నారులపై అత్యాచారాల విషయంలో మరణదండన విధింపునకు దారితీసింది. అయితే ఏడేళ్ళ అనంతరం కూడా మహిళలు తమ రక్షణ విషయంలో సంతృప్తికరంగా లేరు. పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన ‘నేతా యాప్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 80 శాతం మంది స్త్రీలు తమ రక్షణ కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయడంలేదని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని ఈ వేదిక వ్యవస్థాపకుడు ప్రథమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. నేతా యాప్ ఒక లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, కేరళలోని స్త్రీలు తమ పరిసరాల్లో తాము భద్రంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారైనా తాము అభద్రతాభావ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఇతర మెట్రోనగరాలైన ముంబైలో ఇలాంటి రక్షణలేని పరిస్థితులను ఎదుర్కొన్న వారు 41 శాతం ఉంటే, కోల్‌కతాలో 50 శాతం, చెన్నైలో 38 శాతం మంది ఇలాంటి అభద్రతాభావంలో ఉన్నట్టు వెల్లడించారు. మహిళల భద్రతకు భరోసా ఇస్తోన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ తొలిస్థానంలోనూ, ఆ తరువాతి స్థానాలను త్రిపుర, కేరళ ఆక్రమించాయి. తాము సురక్షితంగా ఉన్నామని స్త్రీలు భావిస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో అతి తక్కువ మంది అంటే కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో 61 శాతం మంది స్త్రీలు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామని చెప్పడం విశేషం. అదేవిధంగా హరియాణా బాలబాలికల నిష్పత్తిలో కొంతమెరుగుపడినప్పటికీ పరువు హత్యలు, బాలికల శిశు హత్యల్లాంటి కొన్ని ప్రమాణాల్లో ఈ రాష్ట్రం అత్యంత వెనుకబడిఉన్నట్టు నేతా యాప్ సర్వే వెల్లడించింది. పాలనా వైఫల్యం... ఢిల్లీ ప్రభుత్వం రాజధాని నగరం మొత్తంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు 500 కోట్ల రూపాయలను (70.7 మిలియన్లు)ఖర్చు చేసింది. అయితే కేవలం సీసీటీవీలను ఏర్పాటు చేయడం ఒక్కటే సరిపోదని ఢిల్లీ మహిళల్లో 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా హరియాణా మహిళలు (92 శాతం మంది) స్త్రీల రక్షణ విషయంలో తమ ప్రభుత్వ పాలన పట్ల అత్యంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఇంటిముందు టెంట్ వేసి, ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన రాణిని భర్త బంధువులు అడ్డుకుని దుర్భాషలాడారు. పెట్రోలు పోసి తగలబెడదామని బెదిరించారు. దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి భార్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఎస్తేరురాణి (రాధిక)కు, ఆకుల పవన్కృష్ణకు ఈ ఏడాది జనవరి నెలలో గూడెం రైల్వేస్టేషన్ వద్ద పరిచయం అయింది. స్థానిక జువ్వలపాలెంకు చెందిన టాక్సీ డ్రైవర్ అయిన పవన్‌కృష్ణ అప్పట్లో ఎస్తేరురాణిని స్వగ్రామం మౌంజిపాడుకు కిరాయి నిమిత్తం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒకరి ఫోన్ నంబర్లను మరొకరు తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. వీరద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వ్యవహారానికి దారితీసింది. మే నెలలో పాలంగి గ్రామంలోని శివాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్తేరురాణిని భర్త పవన్‌కృష్ణ రాధికగా అతని తల్లిదండ్రులకు, బంధువులకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో దఫదఫాలుగా రాణి నుంచి పవన్ సుమారు రూ.3.30 లక్షలను తీసుకున్నాడు. కొన్ని రోజులకు తన నుంచి తన భర్త తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన ఎస్తేరురాణి అత్తవారింటికి వెళ్లింది. వారు ఆమెను బైటకు గెంటివేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కృష్ణ బంధువులు ఎస్తేరురాణిపై పలుమార్లు దాడికి దిగారు. దీంతో ఉండ్రాజవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా ప్రాంతాల పోలీసులు కేసులు నమోదు చేశారు. తన భర్తను తనకు అప్పగించాలని శనివారం అత్తవారి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఎస్తేరురాణిని పవన్ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వివాద సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో సద్దుమణిగింది. ఎస్తేరురాణిని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్తేరురాణి సమస్యను పరిష్కరిందుకు మాతా శిశు సంరక్షణ శాఖ వార్డుల సూపర్వైజర్ మంగతాయారు, మానవహక్కుల కమిషన్ కార్యదర్శి విజయకుమారి, కేవీవీ లక్ష్మి, డి.గాయత్రిదేవిలు ఆమె వెంట ఉన్నారు. -
చెయ్‌రా ఛాలెంజ్
ఐస్‌ని నెత్తిమీద వేసుకోగలవా? (ఐస్ బకెట్) డ్రైవ్ చేస్తూ డ్యాన్స్ చేయగలవా? (కీకీ) నీ ఫొటో చూపించగలవా? (అప్పుడు–ఇప్పుడు) సవాల్‌ని స్వీకరిస్తాం. నెట్లో పెట్టేస్తాం. అయితే లైఫ్‌లో తీసుకోవలసిన చాలెంజెస్..వేరే ఉన్నాయని యూత్ అంటోంది. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వగలవా? చాలెంజ్! లైంగిక దాడుల్ని నిరోధించగలవా? చాలెంజ్! నెట్లో పోర్నోగ్రఫీని ఆపగలవా? చాలెంజ్! ఇలాంటి చాలెంజ్‌లు మొదలవ్వాలి. సమాజానికి పట్టిన చీడపీడల్ని వదిలించాలి. జస్సికాలాల్.. గుర్తుండే ఉంటుంది. మోడల్. ఢిల్లీలో.. ఒక సోషలైట్స్ పార్టీలో బార్మెయిడ్గా డ్రింక్ సర్వ్ చేస్తూ టైమ్ అయిపోయిందని.. డ్రింక్స్ క్లోజ్ చేయసాగింది. అప్పటికి టైమ్ రాత్రి.. రెండు గంటలు. హర్యానా ఎంపీ (అప్పటి) వినోద్ శర్మ కొడుకు సిద్ధార్థ వశిష్ట్ ఉరఫ్ మనూ శర్మ వచ్చి ఒక డ్రింక్ ఇవ్వమని అడిగాడు ఆమెను. ‘‘సారీ.. టైమ్ అయిపోయింది’’ అని చాలా పొలైట్‌గా ఆన్సర్ చేసింది. ఆ సమాధానాన్ని లెక్క చేయకుండా డ్రింక్ కోసం పట్టుబట్టాడు. జెస్సికా చాలా మర్యాదగా కుదరదని చెప్పింది. అతని అహం దెబ్బతిన్నది.. తుపాకీ తీసి పేల్చాడు. ఆమె చనిపోయింది. 1999 నాటి సంగతి ఇది. మనుశర్మ కోరుకున్న మద్యం ఖరీదు.. జెస్సికా ప్రాణం!అందుకే ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాలో జెస్సికా అక్క సబ్రీనా పాత్రధారణి అంటుంది ‘‘ఈ దేశంలో ఆడపిల్ల ప్రాణం లిక్కర్ కంటే చీప్’’ అని. ఒక్క మద్యానికే కాదు.. ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవాలనుకున్నా చావును ఆహ్వానించాల్సిందే. కనీసం సదుపాయాలు కావాలనుకున్నా అమ్మాయిలు తమ మానప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సిందే! దీనికి ఉదాహరణ.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిల మీద జరిగిన లైంగిక దాడి, హత్యలే! బస్సు సౌకర్యలేమికి వాళ్ల జీవితాలు బలి! ఇలాంటివి జరిగినప్పుడే గజిని సినిమాలోని.. ‘‘ఒరేయ్ ఇప్పుడిప్పుడే మేం గడపదాటి బయటకు వస్తున్నాం రా.. ఇలాంటి వాటితో మళ్లీ మమ్మల్ని వంటిళ్లకే పరిమితం చేయకండిరా’’ అనే డైలాగ్ గుర్తొస్తుంటుంది. అంతేనా? దేశంలో ఏ మూలన పురుషాహంకారం దాడికి తెగబడినా అమ్మాయిలు వేసుకుంటున్న ఆధునిక దుస్తులను, నడతను తప్పుబడుతున్న ‘సంస్కృతి– సంప్రదాయం– సంస్కారం’ కాలర్ పుచ్చుకొని నిలదీయాలనిపిస్తుంది.. వరంగల్‌లో జరిగిన తొమ్మిది నెలల పసిబిడ్డ రేప్, హత్య గురించి! దేశంలో మంచినీళ్లుండవ్.. మద్యానికి మాత్రం భరోసా! కనీస సౌకర్యాలుండవ్.. ఫ్రీగా వైఫై దొరుకుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్నా.. సారా దుకాణాలు ఎక్కువ. అంబులెన్స్‌ల కన్నా ఫ్రీ ఇంటర్నెట్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి. రిటైర్డ్ పర్సన్స్ మొదలు.. ఏడో తరగతి చదివే పిల్లల దాకా.. అందరికీ పోర్న్ కనిపిస్తుంది. వీటన్నిటి ప్రభావం ఎవరి మీద? పిల్లల మీద.. ఆడవాళ్ల మీద! వంద శాతం అక్షరాస్యత, సెక్స్ ఎడ్యుకేషన్, చైతన్యం ఉన్న దేశాలే సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించాయి. ఫిల్టర్స్ పెట్టాయి. అవేవీ లేని మనం మాత్రం బార్లా తలుపులు తెరిచాం. పర్యవసానాలను అనుభవిస్తున్నాం. ∙∙ ‘‘వయసులో ఉన్నప్పుడూ çకుదురుగా పనిచేసి.. ఇంటి బాధ్యతలు తీసుకున్నది ఎన్నడూ లేదు. ఇప్పుడైతే పని ఊసే లేదు. తాగడం.. నన్ను ఇబ్బంది పెట్టడ్డం. ఈ మధ్య ఫోన్లో ఏవేవో రోత వీడియోలు ఆయన చూడ్డమే కాక.. నాకూ చూపిస్తున్నాడు. అలా చేయమని బలవంతపెడ్తున్నాడు. చేయకపోతే కొడ్తున్నాడు మేడం’’ అంటూ తను డొమెస్టిక్ హెల్పర్‌గా ఉన్న యజమానికి చెప్పి ఏడ్చింది యాభై రెండేళ్ల సావిత్రి. పోర్న్ చూస్తున్నాడని అర్థమైంది ఆ యజమానికి. ఆ రోజే సాయంకాలం ఈ యజమానికి ఆ సర్వెంట్ మెయిడ్ ఆదరాబాదరాగా ఫోన్ చేసింది..‘‘మేడం.. మా ఆయన... మా పక్కింటోళ్ల పదేళ్ల పిల్ల మీద చెయ్యేశాడట మేడం. పంచాయితీ పెట్టారు వాళ్లు. మా ఆయన మీద నేనే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకుంటున్నా. సాయం చేయండి మేడం’’ రిక్వెస్ట్ చేసింది ఏడుస్తూనే! ఇంకోచోట..! బాగా సంపన్నుల కుటుంబం. వాళ్లకు ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులిద్దరూ బిజీ. పిల్లలకు అన్ని సౌకర్యాలూ ఇచ్చారు.. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ సహా. ఆఖరి పిల్లాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడికి వాట్సాప్‌కు రోజూ రేప్ వీడియోలు వస్తున్నాయి. వాటిని చూడ్డం వాడికి అలవాటుగా మారింది. ఒకరోజు స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌ను ఎక్కడో టచ్ చేశాడట. పెద్ద గొడవ. హైదరాబాద్‌లోనే.. బాగా చదువుకున్న ఉమ్మడి కుటుంబంలోనే.. మంచి ఉద్యోగంలో ఉన్న నడివయసు వ్యక్తి.. తన తమ్ముడి ఏడేళ్ల కొడుకును ప్రతిరోజూ అబ్యూజ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తూనే ఆ పిల్లాడు భయంతో వణికిపోయే పరిస్థితి. çపరేషాన్ అయిన తల్లి... అనునయించి అడిగితే పిల్లాడు ఆ తల్లి గుండె పగిలే నిజం చెప్పాడు. ఒక ఊళ్లో..! చదువుకున్న యువకుడే. పద్నాలుగేళ్ల పిల్లను వేధించడం మొదలుపెట్టాడు. పెద్దవాళ్లకు చెబితే తననే తప్పుపడ్తారేమో.. స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చో పెడ్తారేమోనని ఎవరికీ చెప్పకుండా మౌనంగా సహించసాగింది. ఆ వేధింపులు బ్లాక్‌మెయిల్‌గా కూడా మారేసరికి తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పైన ఉదాహరణలన్నీ వాస్తవాలే. చదువు.. చదువులేకపోవడం, ఉన్నత కుటుంబం, దిగువ తరగతి, పల్లె, పట్నం.. తేడా లేకుండా! ఒకవైపు సెక్స్ అనే పదాన్ని వినడం..ఉచ్ఛరించడమే పాపంగా పరిగణిస్తూ.. ఇంకోవైపు పోర్న్‌ను ఫోన్ దగ్గర్లో పెట్టే హిపొక్రసీ కల్చర్ వల్లే ఇలాంటి విపరీతాలు.. హాజీపూర్, వరంగల్ వంటి నేరాలు అంటున్నారు మానసిక, సామాజిక విశ్లేషకులు. ఈ ఘోరాలు జరిగినప్పుడల్లా క్యాండిల్‌లైట్ మార్చ్‌లు, సదస్సులు, రేపిస్ట్‌లను ఉరితీయాలనే సోషల్ మీడియా ప్రచారాలు సర్వసాధారణం. ఉరితో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మూలాన్ని వదిలి పైపైన పూత పూస్తే రోగం తగ్గదు. హిపోక్రసీ వదలాలి. ఆడ, మగ అనాటమీ గురించి తెలియాలి ఇద్దరికీ. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. చాలెంజ్‌లు ఐస్ బకెట్, కీకీ, పదేళ్ల కిందట.. ఇప్పుడు అంటూ పాత, లేటెస్ట్ ఫొటోల పోస్టింగ్ వంటి చాలెంజ్‌లు ప్రపంచంలో ఏ కొసన స్టార్ట్ అయినా.. క్షణాల్లో వాటిని ఓన్ చేసుకొని ఎంతో భక్తితో ఆ చాలెంజెస్‌లో భాగమయ్యే సోషల్ మీడియా పార్టిసిపేంట్స్, ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పదేపదే టెలికాస్ట్ చేస్తూ సెన్సేషన్‌ను క్రియేట్ చేసే మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు యూత్.. జెండర్ సెన్సిటివిటీ మీద చాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ప్రతి ఇంట్లో.. ప్రతి ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, ప్రతి ఊరు.. ప్రతి పట్టణంలో ఆడవాళ్ల పట్ల గౌరవంగా, పిల్లల హక్కుల పట్ల ఎరుకతో ఉండే చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించకూడదు? ఇలాంటి కదలిక వస్తే బాగుంటుంది కదా.. అనేది యూత్ అభిప్రాయం. మొక్కుబడిగా చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఇలాంటి చాలెంజెసే కరెక్ట్ అంటున్నారు పెద్దవాళ్లు. ఎమర్జెన్సీ ప్రకటించాలి రోజురోజుకి ఈ ఘోరాలు పెరిగిపోతున్నాయి. తొమ్మిదినెలల పాపను కూడా వదిలిపెట్టలేదంటే.. చైల్డ్ అండ్ విమెన్ సేఫ్టీ ఎమర్జెన్సీ ప్రకటించాలి. దీన్నొక మూవ్‌మెంట్‌గా మొదలుపెట్టాలి. అయితే ఈ చాలెంజ్‌లో ముందు గవర్నమెంట్‌నే ఇన్వాల్వ్ చేయాలి. అది లిక్కర్, పోర్న్ బ్యాన్తోనే స్టార్ట్ అవ్వాలి. – సి. ప్రియాంక, ఉద్యోగిని, హైదరాబాద్ అనాటమీ తెలియదు మన దగ్గర చాలా మందికి.. అంతెందుకు మా సర్కిల్లోనే చాలా మందికి బాయ్ అండ్ గర్ల్ అనాటమీ తెలియని వాళ్లు బోలెడు. ఇప్పుడు జరుగుతున్న చాలా రేప్‌లకు ఇదీ ఒక కారణం. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అఫ్కోర్స్ లిక్కర్, పోర్న్ నెక్స్ట్ ప్లేస్‌లో ఉంటాయి. అర్జెంట్‌గా జెండర్ సెన్సిటివిటీని చాలెంజ్‌గా స్టార్ట్ చేయాలి. – ఎస్. కౌశిక్, స్టూడెంట్, బోధన్ చైల్డ్ అండ్ విమెన్ సేఫ్టీ ఎమర్జెన్సీ -
పకడ్బందీగా చట్టాల అమలు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చట్టాల అమలుకు కృషి చేస్తుందని రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ ఇన్చార్జి స్నేహిత పేర్కొన్నారు. మంగళవారం మంగళ్‌పల్లి గ్రామంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు షీ టీమ్స్‌పై అవగహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నేహిత మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆకతారుులు బాలికలను ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా షీ టీమ్స్, స్థానిక పోలీసులకు, లేదా 100 నెంబరుకు డయల్ చేసి ఫిర్యాదులు అందించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. రాచకొండ కమిషనర్ వాట్సాప్ నెంబరు 94906 17111 కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అమ్మారుులు సామాజిక మాధ్యమాల్లో పర్సనల్ డాటా, ఫొటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఆత్మరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూలలో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్చార్జి మారుతి, సీఐ స్వామి, మహిళా పోలీసులు వరలక్ష్మి, రుద్రమదేవి ఫౌండేషన్ నిర్వాహకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.