సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్ తరహా సేవలకు వినియోగిస్తున్నారు. వీరి ద్వారా కూడా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా వీరు పోలీసులకు సమాచారం ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.
వీరు ఏం చేస్తారంటే..
రాష్ట్ర వ్యాప్తంగా 14,944 మహిళా సంరక్షణ కార్యదర్శులున్నారు. వీరి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వీరు వారధుల్లా పనిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి పోలీస్ తరహా సేవలందించేలా వీరిని తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్(ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) పద్ధతి అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయాల్లో వీరి ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామాలు, వార్డుల్లో జరిగే అనేక విషయాలను వీరు పోలీస్‌స్టేషన్‌కు నివేదిస్తారు. అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా ఎప్పటికప్పుడు వీరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిస్తారు. అంతేకాదు, మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, మానవ అక్రమ రవాణా నిరోధం, మహిళల భద్రత, రహదారి భద్రత, సైబర్ భద్రత, బాల్య వివాహాలను అరికట్టేందుకు, రైతు ఆత్మహత్యల నిరోధంలో వీరు తమ వంతు పాత్ర పోషిస్తారు. వీటితో పాటు ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వాముల్ని చేస్తున్నారు.
వీరి ద్వారా పోలీస్ సేవలు..
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పోలీస్ సేవలను అందించేలా మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే వారికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) ద్వారా శిక్షణ ఇచ్చాం. శాంతిభద్రతల నిర్వహణలో పలు అంశాలపై ప్రాథమికంగా వీరికి అవగాహన కల్పించాం. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని డిజిటల్ (ఆన్‌లైన్) సేవలను గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్‌తో మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటున్నాం.
– డీజీపీ డి.గౌతమ్ సవాంగ్
చదవండి:
లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు
సిగ్గుంటే రాజీనామా చెయ్..
Comments
Please login to add a commentAdd a comment