బాధితురాలితో మాట్లాడుతున్న సీఐ రఘు,
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఇంటిముందు టెంట్ వేసి, ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన రాణిని భర్త బంధువులు అడ్డుకుని దుర్భాషలాడారు. పెట్రోలు పోసి తగలబెడదామని బెదిరించారు. దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి భార్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఎస్తేరురాణి (రాధిక)కు, ఆకుల పవన్‌కృష్ణకు ఈ ఏడాది జనవరి నెలలో గూడెం రైల్వేస్టేషన్ వద్ద పరిచయం అయింది.
స్థానిక జువ్వలపాలెంకు చెందిన టాక్సీ డ్రైవర్ అయిన పవన్‌కృష్ణ అప్పట్లో ఎస్తేరురాణిని స్వగ్రామం మౌంజిపాడుకు కిరాయి నిమిత్తం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒకరి ఫోన్ నంబర్లను మరొకరు తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. వీరద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వ్యవహారానికి దారితీసింది. మే నెలలో పాలంగి గ్రామంలోని శివాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్తేరురాణిని భర్త పవన్‌కృష్ణ రాధికగా అతని తల్లిదండ్రులకు, బంధువులకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో దఫదఫాలుగా రాణి నుంచి పవన్ సుమారు రూ.3.30 లక్షలను తీసుకున్నాడు. కొన్ని రోజులకు తన నుంచి తన భర్త తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన ఎస్తేరురాణి అత్తవారింటికి వెళ్లింది. వారు ఆమెను బైటకు గెంటివేశారు.
ఈ నేపథ్యంలో పవన్‌కృష్ణ బంధువులు ఎస్తేరురాణిపై పలుమార్లు దాడికి దిగారు. దీంతో ఉండ్రాజవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా ప్రాంతాల పోలీసులు కేసులు నమోదు చేశారు. తన భర్తను తనకు అప్పగించాలని శనివారం అత్తవారి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఎస్తేరురాణిని పవన్ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వివాద సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో సద్దుమణిగింది. ఎస్తేరురాణిని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్తేరురాణి సమస్యను పరిష్కరిందుకు మాతా శిశు సంరక్షణ శాఖ వార్డుల సూపర్‌వైజర్ మంగతాయారు, మానవహక్కుల కమిషన్ కార్యదర్శి విజయకుమారి, కేవీవీ లక్ష్మి, డి.గాయత్రిదేవిలు ఆమె వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment