safety of women
-
మహిళలపై నేరం.. క్షమించరాని పాపం
జల్గావ్: మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల జోలికి రావొద్దని మృగాళ్లను హెచ్చరించారు. పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతాలో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు.మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం ‘లఖ్పతి దీదీ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది మహిళల కోసం రూ.2,500 కోట్ల రివాలి్వంగ్ ఫండ్ విడుదల చేశారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మోదీ ఇంకా ఏమన్నారంటే...మహిళల భద్రత అందరి బాధ్యత ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను కాపాడుకోవాలి. వారి భద్రత దేశానికి ప్రాధాన్యతాంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్లినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరీమణులు, తల్లులు పడుతున్న బాధలు, ఆవేదన నాకు తెలుసు. మహిళలపై నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించేవారిని సైతం విడిచిపెట్టొద్దు. అది ఆసుపత్రి గానీ, పాఠశాల గానీ, ప్రభుత్వ ఆఫీసు గానీ, పోలీసు స్టేషన్ గానీ.. ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మహిళల జీవితాలను, గౌరవాన్ని కాపాడడం మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం, ప్రభుత్వాల బాధ్యత.పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల రుణాలు గత పదేళ్ల పరిపాలనలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. పథకాలు అమలు చేశాం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 2014 వరకూ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పటి ప్రభుత్వాలు ఇచి్చన రుణాలు రూ.25,000 కోట్ల కంటే తక్కువే. కానీ, మేమొచ్చాక గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం. సఖి మండల్ కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. లఖ్పతి దీదీ పథకంతో మహిళల ఆదాయం పెరగడంతోపాటు భవిష్యత్తు తరాల సాధికారత సాధ్యమవుతుంది. మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.ఇందులో మహిళామణుల పాత్ర చాలా కీలకం. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యంతో దేశం ముందంజ వేస్తోంది. ప్రతి ఇంట్లో, పత్రి కుటుంబంలో సౌభాగ్యానికి మహిళలే గ్యారంటీ. కానీ, మహిళలకు సాయపడడానికి గ్యారంటీ ఇచ్చేవాళ్లు లేరు. మహిళల పేరిట ఆస్తులేవీ లేకపోతే వారికి బ్యాంకుల నుంచి రుణాలు రావడం కష్టమే. చిన్న వ్యాపారం చేసుకుందామన్నా రుణం దొరకడం లేదు. ఒక సోదరుడిగా, బిడ్డగా మహిళల కష్టాలను అర్థం చేసుకున్నా. వారి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా.రెండు నెలల్లో 11 లక్షల మంది లఖ్పతి దీదీలు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాం. మహిళల పేరిట జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. ముద్ర పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందుతున్నాయి. ఈ పథకంలో 70 శాతం మంది లబి్ధదారులు మహిళలే. ఈ పథకం వద్దని, రుణాలు తిరిగిరావని కొందరు వాదించారు. అయినప్పటికీ మహిళల పట్ల, వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తుండడం సంతోషం కలిగిస్తోంది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాం. 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఎన్నికల సమయంలో మాటిచ్చా.మహిళాస్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నవారంతా లక్షాధికారులైనట్లే. గత పదేళ్లలో కోటి మంది లఖ్పతి దీదీలను తయారు చేశాం. కేవలం రెండు నెలల్లో కొత్తగా 11 లక్షల మంది లఖ్పతి దీదీలు అయ్యారు. వీరిలో లక్ష మంది మహారాష్ట్ర మహిళలే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మహారాష్ట్ర ఒక షైనింగ్ స్టార్’’ అని మోదీ కొనియాడారు. -
పరువు, ప్రతిష్ఠ – స్త్రీల భద్రత
ఇటీవల ఝార్ఖండ్ పర్యటన కోసం వచ్చిన ఒక విదేశీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన విషయం అనేక చర్చలకి దారితీసింది. బాధితుల తరుపున వేసే ప్రశ్నని నేరంగా చూసే కర్మభూమి మనది. ఈసారి బాధ్యతని జాతీయ మహిళా కమిషన్ చైర్ విమన్ రేఖా శర్మ తీసుకున్నారు. అర్ధరాత్రి, అటవీ ప్రాంతంలో గుడారం వేసుకుని పడుకున్న స్పానిష్, బ్రెజిలియన్ జంటమీద ఏడుగురు వ్యక్తులు దాడిచేసి వారిని కొట్టి, కత్తి చూపి చంపుతామని బెదిరించి, వారి విలువైన వస్తువులు దోచుకుని, మహిళని సామూహికంగా రేప్ చేశారు. ఆసియా పాత్రికేయ రంగంలో పదిహేనేళ్లుగా పని చేస్తున్న డేవిడ్ జోసెఫ్ వోలోజ్కో అనే జర్నలిస్ట్ తన అనుభవాల మేరకి భారతదేశంలో విదేశీ మహిళలు ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదని చెప్పాడు. ఇది వైరల్ అయి రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. అందులో రేఖా శర్మ వేసిన రీట్వీట్– జాతీయ మహిళా కమిషన్ వైఖరిని స్పష్టం చేసింది. ‘ఇటువంటి ఘటనల మీద మీరెప్పుడైనా పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే మీరు పూర్తిగా భాధ్య తారహితమైన మనిషి. కేవలం సోషల్ మీడియాలో రాసుకుంటూ దేశ పరువుని తీయాలనుకోవడం మంచిది కాదని’ హితవు పలికారు. పాతకాలపు సిని మాల్లో, సాహిత్యంలో స్త్రీలమీద అత్యాచారం జరిగిన ఘటనలు చూపించాల్సి వచ్చినపుడు కొన్ని విచి త్రాలు జరిగేవి. ‘ప్రాణం కన్నా మానం విలువైనదని’ చెప్పి ఆ స్త్రీపాత్రని చంపేయడమో, జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావమని సూచించడమో లేదా అత్యాచారం చేసినవాడు పెద్దమనసు చేసు కుని పెళ్లికి సిద్ధపడ డమో చూపించేవారు. పరువు ప్రతిష్ఠలన్నీ స్త్రీల శరీర శీలం చుట్టూ కమ్ముకుని ఉంటాయనీ, శీలంపోతే పరువుపోతుందనీ నమ్మేవారు కనుక మూతముప్పిడి వ్యవహారాలు నడిచేవి. కాలం మారింది. స్త్రీల మీద లైంగికహింస తగ్గకపోయినా, కనీసం అత్యాచారాన్ని ఎలా చూడాలన్న దృష్టికోణంలో కొన్ని మార్పుల యితే వచ్చాయి. అత్యాచారానికి గురైన ఆ విదేశీ మహిళ కూడా, ‘వారు నన్ను చంపకుండా వదిలి పెట్టారు. థాంక్ గాడ్’ అన్నది. దాడికి గురైన వాస్తవం తప్ప ఇందులో పరువు గోల లేదు. భారతదేశంలో విదేశీ స్త్రీలకే కాదు, స్వదేశీ స్త్రీలకి కూడా రక్షణ లేకపోవడం వాస్తవం. ఇటువంటి వర్త మానం ఉన్నచోట భారత మహిళల భద్రత కన్నా దేశపరువు గురించి ఆలోచించే రేఖా శర్మ లాంటివారు ‘కొత్త స్త్రీలు’. వీరు మహిళలని మధ్యయుగాలకి నడి పించుకు వెళ్లగల సమర్థులు. ఈ ఘటన అటవీప్రాంతంలో జరిగింది. లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం వంటి హింసాపద్ధతులని ప్రేరేపించే బైటి ప్రభా వాలకి అక్కడ ఆస్కారం తక్కువ. అటువంటిది మారుమూల ప్రాంతాల్లోకి కూడా కల్చరల్ పొల్యూషన్ వ్యాపించడమనేది జాగ్రత్త పడాల్సిన విషయం. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చి, వారిని చూపించిన తీరుని బట్టి నిందితులు బహుశా స్థానికులు, అట్టడుగువర్గాల వారయ్యే అవకాశం ఉంది. బాధితురాలు విదేశీ మహిళ, అందునా ధైర్యంగా రిపోర్ట్ చేసిన మహిళ అని సంకోచం ఉన్నట్లుంది గానీ లేకపోతే ఈపాటికే ‘ఎన్కౌంటర్ న్యాయం’ డిమాండ్ ఎల్లెడలా వూపు అందుకునేదే. నేరానికి కూడా కులమూ, వర్గమూ ఉంటుంది కనుక, అనువుగా దొరికే నేరస్థుల విషయంలో నేరాన్ని మించిన శిక్షలను విధించి ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారు కనుక, నిందితుల నేరానికి తగినశిక్ష మాత్రమే పడాలన్న మాటని పదేపదే ఇపుడు గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త ప్రరవే (ఏపీ శాఖ) కార్యదర్శి -
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడించడానికి ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పని చేస్తాయన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మహిళా సాధికారత సాధనలో దేశానికే ఏపీ ఆదర్శం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న సీఎం జగన్ “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం జోన్లలో పలు అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించడం కూడా జరిగిందన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల -
వినూత్నం.. ప్రపంచంలోనే మొదటిసారి
సాక్షి, విజయవాడ: మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మహిళలకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగనేనని తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మహిళా చైతన్యం కోసం దిశ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. మహిళల భద్రతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. (చదవండి: ‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం) ప్రపంచంలోనే మొదటిసారి... కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మహిళల కోసం వినూత్నంగా వంద రోజుల కార్యచరణ ప్రపంచంలోనే మొదటిసారి అని, మహిళా కమిషన్ నిర్ణయం మహిళల సాధికారతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మహిళలకు అందేలా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జాయింట్ కలెక్టర్ మాధవీలత అన్నారు. మహిళలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు చాలా జరగాలని జేసీ కోరారు. -
బాలలు, మహిళల భద్రతకు ‘రక్షా’బంధన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘రక్షా’బంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 3వ తేదీన రాఖీ పౌర్ణిమ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలియచేశారు. 4 నుంచి ‘సైబర్ సేఫ్’పై ఆన్లైన్ ద్వారా అవగాహన.. ► బాలలు, మహిళలపై నేరాల తీరు రానురాను మారుతోంది. సైబర్ క్రైమ్ ప్రధాన సవాలుగా మారింది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఆన్లైన్, యాప్స్ వినియోగం బాగా పెరిగింది. వీటిని వినియోగించుకుని బాలలు, మహిళల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించడం, మాయ మాటలతో మోసగించిన పలు ఘటనలు నమోదవుతున్నాయి. ► టెక్నాలజీని ఎలా వాడుకుంటే సైబర్ సేఫ్ జోన్లో ఉంటాం? ఏవి ఉపయోగించకూడదు? ఏవి వాడాలి? లాంటి విషయాల్లో అవగాహన పెరగాలి. ► ఇందుకోసం ప్రత్యేకంగా బాలలు, మహిళల సైబర్ సేఫ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ‘రక్షా’బంధన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. ► ఆగస్ట్ 4 నుంచి నెల రోజులపాటు నిపుణులతో ‘సైబర్ సేఫ్’పై ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తాం. బాలలు, మహిళలను పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములను చేస్తాం. ఆన్లైన్ లింక్, సమయం, ఎలా పాల్గొనాలి? అనే వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. సైబర్ సేఫ్ అవగాహన కార్యక్రమంపై బాలలు, మహిళలకు పోటీలు నిర్వహిస్తాం. సైబర్ సేఫ్టీ నెలగా ఆగస్టు ► ఈ ఏడాది ఆగస్టును ఏపీ సీఐడీ సైబర్ వింగ్ సైబర్ సేఫ్టీ నెలగా ప్రకటించింది. ► 2019లో ఆన్లైన్ షాపింగ్ మోసాలు 21 శాతం, ఓటీపీ మోసాలు 16 శాతం, ఏటీఎం మోసాలు 13 శాతం, ఆన్లైన్ ద్వారా అసభ్య ప్రవర్తన 10 శాతం, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు 10 శాతం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు 4 శాతం, లాటరీ మోసాలు 1శాతం, ఇతర సైబర్ నేరాలు 25 శాతం నమోదయ్యాయి. ► ఫేక్ సమాచారంతో ఫొటోలు, వీడియోలు జత చేసి మోసగించడం, బ్లాక్మెయిల్, లొంగదీసుకోవడం లాంటివి వెలుగు చూస్తున్నాయి. ► సైబర్ నేరాలకు గురయ్యే వారిలో 63 శాతం మందికి సరైన అవగాహన లేక బాధితులుగా మిగులుతున్నారు. ► సైబర్ నేరాలకు గురి కాకుండా అన్ని ఆన్లైన్ ఖాతాలకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. యాప్స్ డౌన్లోడ్, లోకేషన్ పర్మిషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణలో అప్రమత్తత అవసరం. వీటిపై మెరుగైన అవగాహన కల్పించేలా యూట్యూబ్ ద్వారా నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
కేరింతల కెరటాలు..
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర)/ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/గాజువాక: రక్షణ కొరవడిన తరుణాన మృగాళ్లను వేటాడే క్రమంలో పడతుల చేతిలో పాశుపతాస్త్రం వంటి చట్టాన్ని అందించి ‘దిశ’ చూపిన జగనన్నకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు తరుణులు. ఆడపడుచుల్లా ఆదరించాల్సిన అతివలపై అత్యాచారానికి తెగబడితే ఏళ్ల తరబడి విచారణ పేరుతో జాప్యం జరగకుండా 21రోజుల్లోనే దోషులకు కఠిన శిక్ష అమలు చేసేలా రూపొందించిన ‘దిశ’ బిల్లు అసెంబ్లీలో శుక్రవారం ఆమోదం పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణాలో ఘటనకు స్పందించి, మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి తలెత్తకుండా.. కఠిన చట్టాన్ని అమలు చేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పంతో రూపొందిన బిల్లు చట్టసభలో ఆమోదం పొందిన రోజునే ఆయన నగరానికి రావడంతో తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన అన్నకు కృతజ్ఞతా నీరాజనాలు పలికారు మగువలు. ‘థాంక్యూ సీఎం సార్’ నినాదాలతో మార్మోగిన హైవే.. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం విశాఖ రావడంతో థాంక్యూ సీఎం సార్ నినాదాలతో నగరంలోని జాతీయ రహదారి మార్మోగింది. శుక్రవారం సాయంత్రం 4.53 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 5.10 గంటలకు విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు బయల్దేరారు. దారిపొడవునా ప్లకార్డులను ప్రదర్శిస్తూ మహిళలు నీరాజనాలు పలికారు. ఎన్ఏడీ జంక్షన్, బిర్లా, కంచరపాలెం, మర్రిపాలెం, ఆర్ అండ్ బీ, నరసింహనగర్, తాటిచెట్లపాలెం జంక్షన్లతో పాటు బీచ్‌రోడ్డులో సీఎం వాహన శ్రేణి వెళుతున్న సమయంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వారికి అభివాదం చేయగా థాంక్యూ సీఎం సార్ అంటూ జేజేలు పలికారు. విశాఖ విమానాశ్రయంలో సీఎంను కలిసిన మహిళలను అమ్మా బాగున్నారా.. అని ఆప్యాయంగా పలకరించడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడమే గొప్ప విషయం.. అలాంటిది ఆప్యాయంగా పలకరించడం ఇంకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, ఆరీ్పలు, వలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 34వ వార్డు అ«ధ్యక్షుడు పైడిరమణ, 33వ వార్డు అధ్యక్షుడు దుప్పలపూడి శ్రీనివాసరావు, మహిళా అ«ధ్యక్షురాలు గంటా సుభాíÙణి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘థాంక్యూ సీఎం సర్’ అంటూ విద్యార్థినులు ప్లకార్డులను ప్రదర్శించారు. కరస్పాండెంట్ వి.రామారావు, ప్రిన్సిపల్ ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు. జగనన్నకు రాఖీ.. అతివల భద్రతపై ప్రత్యేకంగా దిశ చట్టం తీసుకొచ్చి, మహిళలందరిలో ధైర్యాన్ని నింపిన జగనన్నకు రాఖీ కట్టారు వైఎస్సార్సీపీ మహిళా నేతలు. ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు పార్టీ నేతలు వరుదు కల్యాణి, అక్కరమాని విజయనిర్మల, గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి తదితరులు సీఎం జగన్మోహన్రెడ్డికి శాలువా కప్పి, సన్మానించారు. -
రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్..!
చండీగఢ్ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్, వికలాంగ ఫింఛన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధ లైసెన్స్‌లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది. ఇంకా ఖట్టర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్‌ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్‌టీజింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్‌టీజింగ్ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. -
మహిళల భద్రతకు మొబైల్ ఆప్
భువనేశ్వర్: మహిళల భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం ఓ మొబైల్ ఆప్‌ను ప్రారంభించింది. శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మో సతి' పేరిట దీన్ని ఆరంభించారు. భువనేశ్వర్, కటక్ నగరాల్లోని మహిళల రక్షణ ఈ ఆప్‌ను రూపొందించారు. 'మహిళలకు ఈ ఆప్ అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలు ఈ టెక్నాలజీ సాయంతో రక్షణ పొందవచ్చు. మహిళల రక్షణ, గౌరవం కాపాడేందుకు మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది' అని నవీన్ పట్నాయక్ చెప్పారు. -
మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత
రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు మహిళా భద్రతకు కఠిన చర్యలు, ఈవ్ టీజింగ్‌కు రెండేళ్ల జైలు సింగిల్‌విండో ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులు మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు గ్రామీణ రోడ్లు, వాటర్ గ్రిడ్‌కు ప్రత్యేక కార్పొరేషన్లు.. హుస్సేన్‌సాగర్‌కు వచ్చే నాలాల మళ్లింపునకు రూ.100 కోట్లు 500 మంది కళాకారులకు ఉపాధినిచ్చేందుకు సాంస్కృతిక సారథి కేబినెట్ నిర్ణయాలు బయటకు పొక్కరాదని మంత్రులకు సీఎం హుకుం సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో పరిశ్రమలకు ఎర్రతివాచీ పరుస్తూ, మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కె. చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశాల మేరకు రూపొందిన కొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించిన బిల్లుతో పాటు, మహిళా భద్రతా బిల్లు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల బిల్లు ముసాయిదాలకు ఆదివారం సచివాలయంలో జరిగిన భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు సింగిల్‌విండో విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు కల్పించేలా పారిశ్రామిక విధానాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందించింది. పారిశ్రామికవేత్తలకు సకాలంలో అనుమతులు లభించనిపక్షంలో సంబంధిత అధికారులనే బాధ్యులను చేసేలా ఈ బిల్లులో పొందుపరిచినట్లు తెలిసింది. అలాగే మహిళా భద్రతా బిల్లులో కఠిన శిక్షలను ప్రతిపాదిస్తూ ముసాయిదాను రూపొందించారు. ఈవ్ టీజింగ్‌పై రెండేళ్ల వరకు శిక్ష విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఇక మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా.. పైరవీలకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కూడా నిర్ణయించింది. ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవాలని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మూడు గంటలకుపైగా మంత్రి మండలి చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా కేబినెట్ తాజా నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు 13 అంశాలను కేబినెట్ ఆమోదించినట్లు తెలిసింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఇదివరకు కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని సంస్థలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం, 500 మంది కళాకారులకు ఉపాధినిచ్చేలా సాంస్కృతిక సారథి ఏర్పాటు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా నాళాల మళ్లింపు కోసం వంద కోట్ల రూపాయల కేటాయింపు, గర్భిణీలకు ప్రస్తుతం ఇస్తున్న పోషహాకార సహాయాన్ని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర అధికార చిహ్నాలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి ఆమోదించింది. రెండు కొత్త సంస్థల ఏర్పాటు ప్రతిష్ఠాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతోపాటు, గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం వేర్వేరుగా సంస్థ(కార్పొరేషన్)లను ఏర్పాటు చేయాలని కేబినెట్ తాజాగా నిర్ణయించింది. తెలంగాణలో వచ్చే నాలుగేళ్ల కాలంలో అన్ని గ్రామాలకు పైపులైను ద్వారా మంచి నీటిని అందించే కార్యక్రమంలో భాగంగా వాటర్‌గ్రిడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ. 25 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ బృహత్పథకానికి ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూర్చడం సాధ్యంకాదన్న అభిప్రాయంతో ఉన్న సీఎం.. ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే ప్రాజెక్టు పనులకు అనుమతులు పొందడంలో జాప్యం జరగకుండా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర కార్పొరేషన్ల మాదిరిగానే దీనికీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, డెరైక్టర్లు ఉంటారని, వారే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారని ఓ అధికారి వివరించారు. ఈ కార్పొరేషన్లోకి గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీర్లు, అలాగే ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లను డెప్యుటేషన్‌పై తీసుకోనున్నారు. అవసరమైతే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా వినియోగించుకోనున్నారు. ఇక గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటుతో గ్రామీణ రోడ్ల స్వరూపాన్ని సమూలంగా మార్చాలని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ర్టంలోని 68వేల కిలోమీటర్ల రహదారుల్లో ప్రస్తుతం 18,500 కిలోమీటర్ల మేర బీటీ రహదారులు ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా బీటీ రోడ్లుగా మార్చేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ నిధులను బయటి నుంచి సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ రహదారుల కోసం కూడా బడ్జెట్లో రూ. 2 వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఉన్నప్పటికీ పంచాయతీరాజ్‌లో భాగంగా ఉన్న గ్రామీణ రహదారుల పనులను చేపట్టేందుకు కొత్తగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. నోరు విప్పొద్దు! కేబినెట్ భేటీ వివరాల విషయంలో ఎవరూ నోరువిప్పొద్దని మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్లో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు ‘లీక్’ అయితే సహించబోనని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రులను హెచ్చరించినట్టు తెలిసింది. పలు అంశాలపై అసెంబ్లీలో స్వయంగా తానే ప్రకటన చేస్తానని సీఎం చెప్పారు. కేబినెట్ సమావేశ వివరాలు బయటకు వస్తే సహించేది లేదని ఆయన గట్టిగా చెప్పడంతో మంత్రులంతా మౌనం దాల్చారు. మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయాల గురించి ఎవరిని అడిగినా సున్నితంగా తప్పించుకున్నారు. ‘మీడియాతో ఎవరూ నోరు విప్పొద్దు. అసెంబ్లీలోనే కొన్ని విధాన ప్రకటనలు చేయాల్సి ఉంది. అందుకని మీడియాతో ఎవరు మాట్లాడినా సీరియస్‌గా ప్రతిస్పందించాల్సి ఉంటుంది’ అని సీఎం హెచ్చరించినట్టుగా ఓ మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కట్టడితో కొందరు మంత్రులు తమ ఫోన్లే ఎత్తలేదు. మరికొందరు ఫోన్ ఎత్తినా సంభాషణను మరో అంశంపైకి మళ్లించేందుకు ప్రయత్నించారు. -
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక
సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‘ స్టికర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టికర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి పాల్గొన్నారు. నమోదు చేసుకోని వారికి జరిమానా... కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. స్టిక్కర్లో పూర్తి వివరాలు.... సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టికర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టికర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి. స్టిక్కర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి... సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టికర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టికర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా, ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. -
మాకొద్దు ఈ నగరం !
ఢిల్లీలో మహిళలకు భద్రత అత్యల్పం కాబట్టి తక్కువ జీతానికి అయినా ఇతర నగరాల్లో ఉద్యోగం వెతుక్కోవడం మేలని ఇక్కడ పనిచేసే పరాయి రాష్ట్రాలకు చెందిన ఉద్యోగినులు అనుకుంటున్నారు. మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయడం ఎంతమాత్రమూ సురక్షితం కాదని చెబుతున్నారు. న్యూఢిల్లీ: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన మహిళల్లో సగం మంది రాజధాని నుంచి తిరిగి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది. ఢిల్లీలో మహిళలకు భద్రత అత్యల్పం కాబట్టి తక్కువ జీతానికి అయినా ఇతర నగరాల్లో ఉద్యోగం వెతుక్కోవడం మేలని దాదాపు 43 శాతం మంది అనుకుంటున్నారని ఇది పేర్కొంది. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సీసీఐ) నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోని ఉద్యోగినులు, విద్యార్థినులు, ఉద్యోగార్థులను ప్రశ్నించడం ద్వారా సర్వే నిర్వహించామని సీసీఐ తెలిపింది. ఇది వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్భయ ఉదంతం తరువాత తమ ఉద్యోగాలపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని దాదాపు ఉద్యోగినులంతా అంగీకరించారు. దేశరాజధానిలో దాదాపు 3,400 మంది మహిళలు పనిచేస్తుండగా, వీరిలో 60 శాతం మంది ఇతర రాష్ట్రాలవాసులే. ‘నిర్భయపై సామాహిక అత్యాచార ఘటన తదనంతరం ఢిల్లీలో ఉండడం క్షేమకరం కాదని దాదాపు 43 శాతం మంది మహిళా ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. అందుకే వేరే ఏదైనా నగరంలో ఉద్యోగం వెతుక్కోవడం మేలని అనుకుంటున్నారు. తమ స్వస్థలాకు సమీపంలో ఉండే నగరాలైతే ఇంకా మంచిదని, జీతం తగ్గినా ఫర్వాలేదని భావిస్తున్నారు’ అని సర్వే నివేదిక వివరించింది. పగటి డ్యూటీలే మేలు నగరంలో లైంగిక నేరాల సంఖ్య ఎక్కువవుతుండడంతో, రాత్రిపూట ఉద్యోగాలు ఎంతమాత్రం క్షేమం కాదని మహిళా ఉద్యోగులు అంటున్నారు. ఈ పరిణామం వల్ల తమ విధులను కూడా సక్రమంగా నిర్వహిచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుపోయే వరకు కార్యాలయాల్లో ఉండాలంటే భయమేస్తుందని తెలిపారు. తమకు పగటిపూట ఉద్యోగాలే మేలని సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది స్పష్టం చేశారు. మొత్తం ఉద్యోగుల్లో నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు ప్రభుత్వ రవాణా వాహనాల్లో ప్రయాణించడమే మంచిదని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెట్రోలో ప్రయాణం సురక్షితం కాబట్టి దాని పనివేళలను అర్ధరాత్రి వరకు కొనసాగించాలన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడాలని సర్వేలో పాల్గొన్న వారంతా పేర్కొన్నారు. ‘ట్రాఫిక్ పోలీసులు క్రమం తప్పకుండా రోడ్డు భద్రత మదింపు నిర్వహించడం, సురక్షితం కాదని ప్రదేశాలను గుర్తించడం వంటి చర్యల ద్వారా మాకు భద్రత పెంచవచ్చు. సంఘవ్యతిరేక శక్తులపై ఫిర్యాదు అందగానే పోలీసులు తక్షణం స్పందించాలి’ అని ఒక మహిళ అన్నారు. లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు అనివార్యమని చాలా మంది చెప్పారు. ‘వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్ల వంటివి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మహిళలకు సురక్షితం వాతావరణం కరువవుతోందని చాలా మంది అన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల కల్పన అధ్వానంగా ఉంది’ అని సీసీఐ నివేదిక విశదీకరించింది. -
మహిళల భద్రతే కీలకాంశం
న్యూఢిల్లీ: మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాల ప్రాతిపాదికగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తామని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ నెల నాలుగు జరిగే పోలింగ్‌లో విద్యార్థులు భారీగా పాల్గొనేందుకు విద్యార్థి సంఘాలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. డీయూ విద్యార్థుల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేస్తున్నవారే కావడంతో పోలింగ్ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవినీతి, ధరల నియంత్రణ వంటి సాధారణ సమస్యలతోపాటు విద్యార్థుల సమస్యలపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని యూని యన్ల నాయకులు కోరుతున్నారు. ‘క్యాంపస్‌లో మహిళల భద్రత మాకు అన్నింటికంటే ముఖ్యం. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరికీ ఇదే ప్రధాన సమస్య. క్యాంపస్‌లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే పార్టీకే మేమంతా ఓటేస్తాం. క్యాంపస్‌లో మరింత మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం అవసరం. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి హామీ చూపే అంశం కూడా ప్రభావం చూపుతుంది’ అని కరిష్మా ఠాకూర్ అనే విద్యార్థిసంఘం నాయకురాలు వివరించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లోనూ మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలు కీలకపాత్ర పోషించిన సంగతిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. డీయూలో ఎన్ఎస్యూఐ అధికారంలో ఉన్నప్పుడు ఠాకూర్ క్యాంపస్‌లో జూన్‌లో ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ ఏడాది డూసూ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అనుబంధ ఏబీవీపీ కూడా ఉపాధి కల్పన, మహిళల భద్రత తమకు ప్రధానాంశాలని ప్రకటించింది. అవినీతి నిర్మూలనపై ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రోహిత్ చహల్ స్పందిస్తూ ‘విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ అవినీతి బాధితులే. క్యాంపస్‌లోని అతిపెద్ద సమస్యల్లో ఇదొకటి. అధిక ధరలు కూడా విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడం వల్ల బయటి ప్రాంతాల నుంచి కాలేజీలకు వచ్చే వాళ్లు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల అద్దెలు, కాలేజీల ఫీజులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ, బీజేపీ కృషి చేస్తాయి’ అని ఆయన హామీ ఇచ్చారు. -
ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్న ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్(ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్న ప్రాంతం)లో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో కొత్తగా 40 ఆర్టీసీ బస్సులను సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్‌తో కలిసి ఎ.కె.ఖాన్ మంగళవారం ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను సద్వినియోగం చేసుకుంటే మరో 200 నుంచి 300 బస్సులను నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాగా, ఐటీకారిడార్‌లో భద్రతపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశామని సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. ప్రైవేటు వాహనాలకు బార్కోడ్, ప్రత్యేక స్టిక్కర్లు, ఆటోలు, క్యాబ్‌లలో లోపల డ్రైవర్, యజమాని వివరాలు ఉంచేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ చౌహన్, ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్ జి.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర, ప్రమాదకర సమయాల్లో ఎలా తప్పించుకోవాలో తెలియజేసే విధానాన్ని ఏసీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఖాన్ తెలిపారు. ఆర్టీసీ ఏసీ, వోల్వో తదితర బస్సుల్లో భద్రతను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఇక్కడ వర్క్‌షాపును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ.. ఏసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా కమిషనర్ అనంతరాము పేర్కొన్నారు.