మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత | Safety of women and support to Industries | Sakshi
Sakshi News home page

మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత

Published Mon, Nov 24 2014 1:49 AM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM

మంత్రివర్గ సమావేశం అనంతరం బయటకు వస్తున్న  మంత్రులు జోగు రామన్న,పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్,జగదీశ్‌రెడ్డి,కేటీఆర్, మహేందర్‌రెడ్డి - Sakshi

మంత్రివర్గ సమావేశం అనంతరం బయటకు వస్తున్న మంత్రులు జోగు రామన్న,పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్,జగదీశ్‌రెడ్డి,కేటీఆర్, మహేందర్‌రెడ్డి

 రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు
 మహిళా భద్రతకు కఠిన చర్యలు, ఈవ్ టీజింగ్‌కు రెండేళ్ల జైలు
 సింగిల్‌విండో ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులు
 మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు
 గ్రామీణ రోడ్లు, వాటర్ గ్రిడ్‌కు ప్రత్యేక కార్పొరేషన్లు..
 హుస్సేన్‌సాగర్‌కు వచ్చే నాలాల మళ్లింపునకు రూ.100 కోట్లు
 500 మంది కళాకారులకు ఉపాధినిచ్చేందుకు సాంస్కృతిక సారథి
 కేబినెట్ నిర్ణయాలు బయటకు పొక్కరాదని మంత్రులకు సీఎం హుకుం
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో పరిశ్రమలకు ఎర్రతివాచీ పరుస్తూ, మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కె. చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశాల మేరకు రూపొందిన కొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించిన బిల్లుతో పాటు, మహిళా భద్రతా బిల్లు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల బిల్లు ముసాయిదాలకు ఆదివారం సచివాలయంలో జరిగిన  భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు సింగిల్‌విండో విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు కల్పించేలా పారిశ్రామిక విధానాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందించింది. పారిశ్రామికవేత్తలకు సకాలంలో అనుమతులు లభించనిపక్షంలో సంబంధిత అధికారులనే బాధ్యులను చేసేలా ఈ బిల్లులో పొందుపరిచినట్లు తెలిసింది. అలాగే మహిళా భద్రతా బిల్లులో కఠిన శిక్షలను ప్రతిపాదిస్తూ ముసాయిదాను రూపొందించారు. ఈవ్ టీజింగ్‌పై రెండేళ్ల వరకు శిక్ష విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఇక మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా.. పైరవీలకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కూడా నిర్ణయించింది.

ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవాలని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మూడు గంటలకుపైగా మంత్రి మండలి చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా కేబినెట్ తాజా నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు 13 అంశాలను కేబినెట్ ఆమోదించినట్లు తెలిసింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఇదివరకు కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని సంస్థలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం, 500 మంది కళాకారులకు ఉపాధినిచ్చేలా సాంస్కృతిక సారథి ఏర్పాటు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా నాళాల మళ్లింపు కోసం వంద కోట్ల రూపాయల కేటాయింపు, గర్భిణీలకు ప్రస్తుతం ఇస్తున్న పోషహాకార సహాయాన్ని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర అధికార చిహ్నాలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి ఆమోదించింది.

 రెండు కొత్త సంస్థల ఏర్పాటు
 ప్రతిష్ఠాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతోపాటు, గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం వేర్వేరుగా సంస్థ(కార్పొరేషన్)లను ఏర్పాటు చేయాలని కేబినెట్ తాజాగా నిర్ణయించింది. తెలంగాణలో వచ్చే నాలుగేళ్ల కాలంలో అన్ని గ్రామాలకు పైపులైను ద్వారా మంచి నీటిని అందించే కార్యక్రమంలో భాగంగా వాటర్‌గ్రిడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ. 25 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ బృహత్‌పథకానికి ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూర్చడం సాధ్యంకాదన్న అభిప్రాయంతో ఉన్న సీఎం.. ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే ప్రాజెక్టు పనులకు అనుమతులు పొందడంలో జాప్యం జరగకుండా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర కార్పొరేషన్ల మాదిరిగానే దీనికీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, డెరైక్టర్లు ఉంటారని, వారే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారని ఓ అధికారి వివరించారు. ఈ కార్పొరేషన్‌లోకి గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీర్లు, అలాగే ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లను డెప్యుటేషన్‌పై తీసుకోనున్నారు.

అవసరమైతే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా వినియోగించుకోనున్నారు. ఇక గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటుతో గ్రామీణ రోడ్ల స్వరూపాన్ని సమూలంగా మార్చాలని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ర్టంలోని 68వేల కిలోమీటర్ల రహదారుల్లో ప్రస్తుతం 18,500 కిలోమీటర్ల మేర బీటీ రహదారులు ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా బీటీ రోడ్లుగా మార్చేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ నిధులను బయటి నుంచి సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ రహదారుల కోసం కూడా బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఉన్నప్పటికీ పంచాయతీరాజ్‌లో భాగంగా ఉన్న గ్రామీణ రహదారుల పనులను చేపట్టేందుకు కొత్తగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.
 
 నోరు విప్పొద్దు!
 కేబినెట్ భేటీ వివరాల విషయంలో ఎవరూ నోరువిప్పొద్దని మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్‌లో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు ‘లీక్’ అయితే సహించబోనని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రులను హెచ్చరించినట్టు తెలిసింది. పలు అంశాలపై అసెంబ్లీలో స్వయంగా తానే ప్రకటన చేస్తానని సీఎం చెప్పారు. కేబినెట్ సమావేశ వివరాలు బయటకు వస్తే సహించేది లేదని ఆయన గట్టిగా చెప్పడంతో మంత్రులంతా మౌనం దాల్చారు. మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయాల గురించి ఎవరిని అడిగినా సున్నితంగా తప్పించుకున్నారు. ‘మీడియాతో ఎవరూ నోరు విప్పొద్దు. అసెంబ్లీలోనే కొన్ని విధాన ప్రకటనలు చేయాల్సి ఉంది. అందుకని మీడియాతో ఎవరు మాట్లాడినా సీరియస్‌గా ప్రతిస్పందించాల్సి ఉంటుంది’ అని సీఎం హెచ్చరించినట్టుగా ఓ మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కట్టడితో కొందరు మంత్రులు తమ ఫోన్లే ఎత్తలేదు. మరికొందరు ఫోన్ ఎత్తినా సంభాషణను మరో అంశంపైకి మళ్లించేందుకు ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement