సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.
గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్‌లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నారన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడించడానికి ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పని చేస్తాయన్నారు.
ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
మహిళా సాధికారత సాధనలో దేశానికే ఏపీ ఆదర్శం: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న సీఎం జగన్ “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం జోన్లలో పలు అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించడం కూడా జరిగిందన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు.
అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.
చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment