మహిళల భద్రతే కీలకాంశం
Published Mon, Dec 2 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
న్యూఢిల్లీ: మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాల ప్రాతిపాదికగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తామని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ నెల నాలుగు జరిగే పోలింగ్‌లో విద్యార్థులు భారీగా పాల్గొనేందుకు విద్యార్థి సంఘాలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. డీయూ విద్యార్థుల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేస్తున్నవారే కావడంతో పోలింగ్ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవినీతి, ధరల నియంత్రణ వంటి సాధారణ సమస్యలతోపాటు విద్యార్థుల సమస్యలపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని యూని యన్ల నాయకులు కోరుతున్నారు.
‘క్యాంపస్‌లో మహిళల భద్రత మాకు అన్నింటికంటే ముఖ్యం. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరికీ ఇదే ప్రధాన సమస్య. క్యాంపస్‌లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే పార్టీకే మేమంతా ఓటేస్తాం. క్యాంపస్‌లో మరింత మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం అవసరం. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి హామీ చూపే అంశం కూడా ప్రభావం చూపుతుంది’ అని కరిష్మా ఠాకూర్ అనే విద్యార్థిసంఘం నాయకురాలు వివరించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లోనూ మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలు కీలకపాత్ర పోషించిన సంగతిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. డీయూలో ఎన్‌ఎస్‌యూఐ అధికారంలో ఉన్నప్పుడు ఠాకూర్ క్యాంపస్‌లో జూన్‌లో ఉద్యోగమేళా నిర్వహించారు.
ఈ ఏడాది డూసూ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అనుబంధ ఏబీవీపీ కూడా ఉపాధి కల్పన, మహిళల భద్రత తమకు ప్రధానాంశాలని ప్రకటించింది. అవినీతి నిర్మూలనపై ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రోహిత్ చహల్ స్పందిస్తూ ‘విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ అవినీతి బాధితులే. క్యాంపస్‌లోని అతిపెద్ద సమస్యల్లో ఇదొకటి. అధిక ధరలు కూడా విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడం వల్ల బయటి ప్రాంతాల నుంచి కాలేజీలకు వచ్చే వాళ్లు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల అద్దెలు, కాలేజీల ఫీజులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ, బీజేపీ కృషి చేస్తాయి’ అని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement