Delhi University students
-
ఆమరణ దీక్షకు ఢిల్లీ విద్యార్థుల మద్దతు..
సాక్షి, ఢిల్లీ: వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు మద్దతు తెలిపారు. అంతేకాక హోదా కోసం ఎంపీలు పదవులు త్యాగం చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలను చూసైనా టీడీపీ ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే హోదా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హోదా వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: వైవీ గతంలో చెప్పినట్లే మేము రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వైవీ సూచించారు. పదవులు కాదు.. ప్రజలు ముఖ్యం: మిథున్‌రెడ్డి మాకు పదవులు కాదు.. ప్రజలు ముఖ్యం అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలే మాకు శ్రీరామరక్ష అని ఎంపీ చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పదవులకు రాజీనామా చేశామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రజల అభీష్టమే మాకు ముఖ్యం: మేకపాటి రాజీనామాలపై తొందర పడొద్దని స్పీకర్ అన్నారు.. కానీ ప్రజల అభిష్టమే మాకు ముఖ్యమని స్పీకర్‌కు చెప్పామని మేకపాటి తెలిపారు. డ్రామాలు చేయడం టీడీపీ నేతలకే అలవాటు అని ఆయన మండిపడ్డారు. ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో ప్రజలకు తెలుసు.. టీడీపీ ఏం చేసినా రాజకీయ లబ్ధి కోసమే అని ఎంపీ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదని మేకపాటి తెలిపారు. విభజన హామీలన్ని అమలు చేయాలి: అవినాష్ హోదా సహా విభజన హామీలన్ని అమలు చేయాలని ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకూ మా పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆమరణ దీక్ష చేస్తున్నాం:వరప్రసాద్ అవిశ్వాసంపై చర్చకు అవకాశం ఇవ్వలేదు.. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులకు రాజీనామా చేశామని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నామని ఎంపీ చెప్పారు. మేం రాజీనామాలు చేస్తామంటే సీఎం చంద్రబాబు హేళన చేశారని ఎంపీ గుర్తు చేశారు. ప్రజల కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధమని ఎంపీ వరప్రసాద్ తెలిపారు. రాజీనామాలు చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉందని ఎంపీ అన్నారు. -
ఉబర్ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..!
హైదరాబాద్‌లో చిన్నారి రమ్య విషాదాంత ఘటన తరహాలోనే రాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలు విడిచిన ఓ విద్యార్థిని ఉదంతం దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల అమ్మాయి కాయుం పెగూ బుధవారం కన్నుమూసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి గత శుక్రవారం ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించిన కాయుం.. మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు విడిచింది. స్టెపెంబర్ 23న నోయిడాలోని సెక్టర్ 16ఏ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాయుం ఐసీయూలో ఉందని, ఆమె కోసం ’ఓ పాజిటివ్’ రక్తాన్ని ఎవరైనా దానం చేయాలని కోరుతూ ఆమె సోదరుడు రికేష్ పెగూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టును 18వేల మంది షేర్ చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాయుం బుధవారం తుదిశ్వాస విడిచిందని అతని సోదరుడు ఫేస్బుక్లో వెల్లడించారు. ఢిల్లీలోని మిరాండ హౌస్ కాలేజీలో చదువుతున్న కాయుం గత శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి నోయిడాలో ఓ జన్మదిన వేడుకకు వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు స్నేహితులు ఉబర్ క్యాబ్‌లో తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఎదురుగా పార్కింగ్ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. నిందితుడిని విఘ్నేష్‌గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన మిగతా ముగ్గురిని తనూజ కలిత, సిద్ధార్థ పాఠక్, అక్షర బడోలాగా గుర్తించారు. ఈ ముగ్గురికి ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. ‘క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. సిగరెట్ కాలుస్తూ క్యాబ్ నడిపిన అతను నేరుగా పార్కింగ్ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ మమ్మల్ని పట్టించుకోకుండా సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు’ అని ఈ ఘటనలో గాయపడిన తనూజ కలిత తెలిపింది. కాయుం మృతికి కారణమైన ఉబర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సహచర విద్యార్థులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు. యువకుల ర్యాష్ డ్రైవింగ్ వల్ల హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోయిన విషయం తెలిసిందే. -
ప్రత్యేక అవకాశాన్ని పునరుద్ధరించాలి'
న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల జవాబుపత్రాల తిరిగి మూల్యాంకణానికి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ కారణాల వల్ల నిర్దేశించిన కాలానికి డిగ్రీ కోర్సులను పూర్తి చేయని విద్యార్థులకు మరో ‘ప్రత్యేక అవకాశం ఇవ్వాలని’ విద్యార్థి సంఘాలు వర్సిటీ అధికారులను కోరుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతరత్రా పరిస్థితుల వల్ల కోర్సును పూర్తి చేయని విద్యార్థులకు ఈ అవకాశం గొప్పసహాయకారిగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్‌యూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ అభిప్రాయపడ్డారు. పరీక్షల విభాగంపై అధిక ఒత్తిడి పడుతున్నదనే కారణంతో గతంలో ఉన్న ఈ ‘ప్రత్యేక అవకాశాన్ని’ వర్సిటీ రద్దు చేసిందని చెప్పారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు వర్సీటీ రూల్స్ ప్రకారం ప్రవేశం పొందిన తేదీ నుంచి (డిగ్రీని ఆరు సంవత్సరాల్లో, పీజీని నాలుగు సంవత్సరాల్లో )పూర్తి చేయాల్సి ఉంది. ‘ ప్రత్యేక అవకాశం కల్పించడం ద్వారా మధ్యలో చదువులు నిలిపేసిన విద్యార్థులు పెండింగ్ పరీక్షలు రాయడానికి వీలుకలిగింది. కానీ రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని డీయూ రద్దు చేసింది. ఈ విషయమై 32 మంది విద్యార్థులు ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల విజ్ఞప్తిని పరిశీలించి అవకాశం ఇవ్వాలని హైకోర్టు డీయూ అకాడమిక్ కౌన్సిల్‌కు సూచించింది. విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించడం చట్టవ్యతిరేకమని డీయూ నిబంధనల్లో ఎక్కడా లేదని గుర్తు చేసిందని డీయూ మీడియా కోఆర్డినేటర్, విద్యార్థుల సంక్షేమం జాయింట్ డీన్ మాలె నీరవ్ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి ‘ప్రత్యేక అవకాశాన్ని’ విద్యార్థులకు కల్పించామని డీయూ అధికారి పేర్కొన్నారు. మళ్లీ ఈ అవకాశాన్ని తిరిగి కల్పించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. -
నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయండి
మంత్రి స్మృతీ ఇరానీని కలసిన డీయూ విద్యార్థులు, ఉపాధ్యాయులు న్యూఢిల్లీ: నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయాలని, వైస్ చాన్సలర్ దినేష్సింగ్ను తొల గించాలని కోరుతూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రతినిధి బృందం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి వినతిపత్రం అందజేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, డీయూ ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్లకు చెందిన విద్యార్థులు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(డీయూటీఎ), డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్‌కు చెందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పాతపద్ధతైన మూడేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులు మంత్రిని కలిసి నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయాలని కోరారని డీయూటీఎ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సైకత్ ఘోష్ తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీని విమర్శించిన విద్యార్థులు, టీచర్లు ైవె స్ చాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విదేశీ యూనివర్సిటీలను అనుకరించాలని వైస్ చాన్సలర్ చూస్తున్నారని వారు విమర్శించారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఆయన బలవంతంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును విద్యార్థుల మీద రుద్దారని, ఇక్కడ విదేశీ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారని డీయూ ఎస్సీ, ఎస్టీ ఫోరమ్ కన్వీనర్ హంసరాజ్ సుమన్ ఆరోపించారు. 2013లో మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల డిగ్రీగా మారుస్తూ ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. వైస్ చాన్సలర్ దినేష్‌సింగ్ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. -
మహిళల భద్రతే కీలకాంశం
న్యూఢిల్లీ: మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాల ప్రాతిపాదికగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తామని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ నెల నాలుగు జరిగే పోలింగ్‌లో విద్యార్థులు భారీగా పాల్గొనేందుకు విద్యార్థి సంఘాలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. డీయూ విద్యార్థుల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేస్తున్నవారే కావడంతో పోలింగ్ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవినీతి, ధరల నియంత్రణ వంటి సాధారణ సమస్యలతోపాటు విద్యార్థుల సమస్యలపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని యూని యన్ల నాయకులు కోరుతున్నారు. ‘క్యాంపస్‌లో మహిళల భద్రత మాకు అన్నింటికంటే ముఖ్యం. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరికీ ఇదే ప్రధాన సమస్య. క్యాంపస్‌లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే పార్టీకే మేమంతా ఓటేస్తాం. క్యాంపస్‌లో మరింత మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం అవసరం. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి హామీ చూపే అంశం కూడా ప్రభావం చూపుతుంది’ అని కరిష్మా ఠాకూర్ అనే విద్యార్థిసంఘం నాయకురాలు వివరించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లోనూ మహిళల భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలు కీలకపాత్ర పోషించిన సంగతిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. డీయూలో ఎన్ఎస్యూఐ అధికారంలో ఉన్నప్పుడు ఠాకూర్ క్యాంపస్‌లో జూన్‌లో ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ ఏడాది డూసూ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అనుబంధ ఏబీవీపీ కూడా ఉపాధి కల్పన, మహిళల భద్రత తమకు ప్రధానాంశాలని ప్రకటించింది. అవినీతి నిర్మూలనపై ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రోహిత్ చహల్ స్పందిస్తూ ‘విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ అవినీతి బాధితులే. క్యాంపస్‌లోని అతిపెద్ద సమస్యల్లో ఇదొకటి. అధిక ధరలు కూడా విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడం వల్ల బయటి ప్రాంతాల నుంచి కాలేజీలకు వచ్చే వాళ్లు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల అద్దెలు, కాలేజీల ఫీజులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ, బీజేపీ కృషి చేస్తాయి’ అని ఆయన హామీ ఇచ్చారు.