నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయండి
మంత్రి స్మృతీ ఇరానీని కలసిన డీయూ విద్యార్థులు, ఉపాధ్యాయులు
న్యూఢిల్లీ: నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయాలని, వైస్ చాన్సలర్ దినేష్‌సింగ్‌ను తొల గించాలని కోరుతూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రతినిధి బృందం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి వినతిపత్రం అందజేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, డీయూ ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌లకు చెందిన విద్యార్థులు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(డీయూటీఎ), డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్‌కు చెందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
పాతపద్ధతైన మూడేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులు మంత్రిని కలిసి నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేయాలని కోరారని డీయూటీఎ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సైకత్ ఘోష్ తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీని విమర్శించిన విద్యార్థులు, టీచర్లు ైవె స్ చాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విదేశీ యూనివర్సిటీలను అనుకరించాలని వైస్ చాన్సలర్ చూస్తున్నారని వారు విమర్శించారు.
అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఆయన బలవంతంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును విద్యార్థుల మీద రుద్దారని, ఇక్కడ విదేశీ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారని డీయూ ఎస్‌సీ, ఎస్టీ ఫోరమ్ కన్వీనర్ హంసరాజ్ సుమన్ ఆరోపించారు. 2013లో మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల డిగ్రీగా మారుస్తూ ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. వైస్ చాన్సలర్ దినేష్‌సింగ్ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.