సాక్షి, ఢిల్లీ: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు మద్దతు తెలిపారు. అంతేకాక హోదా కోసం ఎంపీలు పదవులు త్యాగం చేయడం అభినందనీయమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను చూసైనా టీడీపీ ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే హోదా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హోదా వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: వైవీ
గతంలో చెప్పినట్లే మేము రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వైవీ సూచించారు.
పదవులు కాదు.. ప్రజలు ముఖ్యం: మిథున్‌రెడ్డి
మాకు పదవులు కాదు.. ప్రజలు ముఖ్యం అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలే మాకు శ్రీరామరక్ష అని ఎంపీ చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పదవులకు రాజీనామా చేశామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.
ప్రజల అభీష్టమే మాకు ముఖ్యం: మేకపాటి
రాజీనామాలపై తొందర పడొద్దని స్పీకర్ అన్నారు.. కానీ ప్రజల అభిష్టమే మాకు ముఖ్యమని స్పీకర్‌కు చెప్పామని మేకపాటి తెలిపారు. డ్రామాలు చేయడం టీడీపీ నేతలకే అలవాటు అని ఆయన మండిపడ్డారు. ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో ప్రజలకు తెలుసు.. టీడీపీ ఏం చేసినా రాజకీయ లబ్ధి కోసమే అని ఎంపీ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదని మేకపాటి తెలిపారు.
విభజన హామీలన్ని అమలు చేయాలి: అవినాష్
హోదా సహా విభజన హామీలన్ని అమలు చేయాలని ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకూ మా పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆమరణ దీక్ష చేస్తున్నాం:వరప్రసాద్
అవిశ్వాసంపై చర్చకు అవకాశం ఇవ్వలేదు.. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులకు రాజీనామా చేశామని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నామని ఎంపీ చెప్పారు. మేం రాజీనామాలు చేస్తామంటే సీఎం చంద్రబాబు హేళన చేశారని ఎంపీ గుర్తు చేశారు. ప్రజల కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధమని ఎంపీ వరప్రసాద్ తెలిపారు. రాజీనామాలు చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉందని ఎంపీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment