‘ప్రత్యేక హోదా’ 20 ఏళ్లకు పెంచండి: మేకపాటి
న్యూఢిల్లీ: విభజన తర్వాత ఏర్పడిన అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదాను 20 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన బిల్లులో పేర్కొన్న అన్ని వాగ్దానాలతోపాటు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని కోరారు. బుధవారం లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
‘తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిబంధనలకు విరుద్ధంగా విడగొట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలున్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో చెప్పినట్టుగా అన్ని హామీలనూ నెరవేర్చాలి. ముఖ్యంగా ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కనీసం 20 ఏళ్లుగా మార్చాలి’ అని కోరారు.