ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..! | DU student died after drunk Uber driver rams into a truck in Noida | Sakshi
Sakshi News home page

ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..!

Published Wed, Sep 28 2016 7:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..! - Sakshi

ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..!

హైదరాబాద్‌లో చిన్నారి రమ్య విషాదాంత ఘటన తరహాలోనే రాష్‌ డ్రైవింగ్‌ వల్ల ప్రాణాలు విడిచిన ఓ విద్యార్థిని ఉదంతం దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల అమ్మాయి కాయుం పెగూ బుధవారం కన్నుమూసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి గత శుక్రవారం ఉబర్‌ క్యాబ్‌లో ప్రయాణించిన కాయుం.. మద్యం మత్తులో క్యాబ్‌ డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రాణాలు విడిచింది.

స్టెపెంబర్‌ 23న నోయిడాలోని సెక్టర్‌ 16ఏ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాయుం ఐసీయూలో ఉందని, ఆమె కోసం ’ఓ పాజిటివ్‌’  రక్తాన్ని ఎవరైనా దానం చేయాలని కోరుతూ ఆమె సోదరుడు రికేష్‌ పెగూ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టును 18వేల మంది షేర్‌ చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాయుం బుధవారం తుదిశ్వాస విడిచిందని అతని సోదరుడు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

ఢిల్లీలోని మిరాండ హౌస్‌ కాలేజీలో చదువుతున్న కాయుం గత శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి నోయిడాలో ఓ జన్మదిన వేడుకకు వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు స్నేహితులు ఉబర్‌ క్యాబ్‌లో తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ ఎదురుగా పార్కింగ్‌ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. నిందితుడిని విఘ్నేష్‌గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన మిగతా ముగ్గురిని తనూజ కలిత, సిద్ధార్థ పాఠక్‌, అక్షర బడోలాగా గుర్తించారు. ఈ ముగ్గురికి ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది.

‘క్యాబ్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు. సిగరెట్‌ కాలుస్తూ క్యాబ్‌ నడిపిన అతను నేరుగా పార్కింగ్‌ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్‌ మమ్మల్ని పట్టించుకోకుండా సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు’ అని ఈ ఘటనలో గాయపడిన తనూజ కలిత తెలిపింది. కాయుం మృతికి కారణమైన ఉబర్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సహచర విద్యార్థులు, ప్రొఫెసర్లు డి​మాండ్‌ చేస్తున్నారు. యువకుల ర్యాష్ డ్రైవింగ్ వల్ల హైదరాబాద్‌ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement