ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్ | Bus transport service launched to improve safety of women in Cyberabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్

Published Wed, Nov 20 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్

ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్

సాక్షి, హైదరాబాద్: ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్న ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఆర్‌టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్(ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్న ప్రాంతం)లో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో కొత్తగా 40 ఆర్టీసీ బస్సులను సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్‌తో కలిసి ఎ.కె.ఖాన్ మంగళవారం ప్రారంభించారు.  కొత్తగా ప్రారంభించిన బస్సులను సద్వినియోగం చేసుకుంటే మరో 200 నుంచి 300 బస్సులను నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాగా, ఐటీకారిడార్‌లో భద్రతపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశామని సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు.
 
 ప్రైవేటు వాహనాలకు బార్‌కోడ్, ప్రత్యేక స్టిక్కర్లు, ఆటోలు, క్యాబ్‌లలో లోపల డ్రైవర్, యజమాని వివరాలు ఉంచేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ చౌహన్, ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్ జి.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర, ప్రమాదకర సమయాల్లో ఎలా తప్పించుకోవాలో తెలియజేసే విధానాన్ని ఏసీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఖాన్ తెలిపారు. ఆర్‌టీసీ ఏసీ, వోల్వో తదితర బస్సుల్లో భద్రతను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఇక్కడ వర్క్‌షాపును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ.. ఏసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా కమిషనర్ అనంతరాము పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement