ఇంగ్లిష్ టీచర్లు ఇంగ్లిష్ లో ఫెయిల్ అయ్యారు!
చంఢీఘర్:ఏ భాష భోదించే టీచర్లకైనా ఆ భాషపై కనీస పట్టు ఉండాలి. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ బోధించే ప్రభుత్వ టీచర్లు ఆ సబ్జెక్ట్ లో బాగా వెనుకబడిపోయారట. తాజాగా కొంతమంది ఇంగ్లిష్ టీచర్లకు అక్కడ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించగా ఆశ్చర్యపోయే విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పని చేస్తున్న 220 మంది ఇంగ్లిష్ టీచర్లకు ఇంగ్లిష్ టెస్టు నిర్వహించారు.అయితే వారు ఇంగ్లిష్ లో భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు మొదలుకొని దాదాపు అన్ని పదాలను తప్పుగా రాసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దలిత్ సింగ్ చీమా తెలిపారు.టీచర్లు చేసిన తప్పిదాలను స్కూళ్లకు తిరిగి వెళ్లిన తరువాత తెలుసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక శాతం మంది ఇంగ్లిష్ భాషలో తప్పడంతో మొహాలీ పట్టణంలో టీచర్లతో విద్యాశాఖ సమావేశం నిర్వహించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు హాజరుకాగా.. అందులో ఎనభై వేలమందికి పైగా పరీక్షల్లో తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.