రూ.8.29లక్షలు పట్టివేత
జన్నారం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న అధికారులు శనివారం పెద్దమొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్, డెప్యూటీ తహశీల్దార్ జాడి రాజలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్‌ను ఇందన్పల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా మంథనికి చెందిన డ్రైవర్ మారిశెట్టి కుమార్ వద్ద రూ.3,84,205 లభించాయి.
ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయ గా డ్రైవర్ నాంపెల్లి ఓదెలు వద్ద రూ.3,44,860 లభించాయి. వీరిని ప్రశ్నించగా ఆదిలాబాద్‌లోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మి డబ్బులు తెస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నుంచి పెద్దపెల్లికి వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా.. ప్రయాణికుడు సాగర్, సంతోష్‌ల వద్ద రూ.లక్ష లభించాయి. వారు కూడా పత్తి విక్రయించి డబ్బు తెస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు చూపిస్తే డబ్బు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై బుద్దే స్వామి, ఏఆర్ ఎస్సై ఉత్తం, కానిస్టేబుల్ అశోక్, టీం సభ్యులు ఆత్రం రవీందర్, రాకేశ్, భూమాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.