పాటమ్మను విడిచిన భిక్షపతి
అనారోగ్యంతో స్వగ్రామం బయ్యారంలో కన్నుమూత
మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన నేతలు
బయ్యారం: 'నిన్ను విడిచి ఉండలేనమ్మా.. ఓ పాటమ్మా.. నిన్నెన్నడూ మరవలేనమ్మా.. ఓ పాటమ్మా..' అంటూ తన గొంతుతో అందరి అభిమానాన్ని చూరగొన్న అమ్మపాట (దేవరకొండ) భిక్షపతి (38) గురువారం రాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన భిక్షపతి చిన్నప్పటి నుండి పాటల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పలు పాటలు పాడి ప్రజలను ఉద్యమాలకు ఆకర్షితులను చేశారు. ఆ తరువాత కొంతకాలం ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ పాటమ్మ పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రజాయుద్ధనౌక గద్దర్చే 2005 లో బయ్యారంలో ఆవిష్కరింపచేసి కళాకారునిగా, కవిగా రాష్ట్రవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన పలు ధూం..ధాం కార్యక్రమాల్లో పాల్గొన్న భిక్షపతి తన ఆట, పాటల ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజల మదిలో స్థానం సంపాదించి మృత్యు ఒడిలోకి చేరిన భిక్షపతి తన పుట్టినగడ్డ బయ్యారంపై రచించి స్వయంగా పాడిన మా ఊరు పాటను తలుచుకుంటూ బయ్యారం వాసులు విషాదంలో మునిగిపోయారు.
పాటమ్మ భిక్షపతి మృతదేహాన్ని శుక్రవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జెడ్పీటీసీ గౌని ఐలయ్య, ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, ప్రజాకళాకారులు నేర్నాల కిషోర్, గిద్దే రామనర్సయ్య, కొమిరె వెంకన్న, సారంగపాణి, అరుణోదయ కళాకారులు నాగన్న, నిర్మల, బిచ్యా, సునీత, సీత, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ బెల్లయ్యనాయక్, టీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు.
రూ.2.5 లక్షల సహాయం: ఎమ్మెల్యే రసమయి
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కవి, గాయకుడు అమ్మపాట భిక్షపతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందని, త్వరలో కుటుంబ సభ్యులకు అందజేస్తామని రసమయి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన భిక్షపతి మరణం తీరని లోటని బాలకిషన్ పేర్కొన్నారు.