మారడోనా డిశ్చార్జి
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం, 1986 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చాంపియన్ కెప్టెన్ డీగో మారడోనా ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి అయ్యాడు. ఈ విషయాన్ని అతని వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుఖ్ వెల్లడించారు. మెదడులోని నాళాల మధ్య రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో మారడోనాకు గత వారం ‘సబ్డ్యూరల్ హెమటోమా’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ అతను కోలుకునేందుకు ఇంటివద్ద చికిత్స కొనసాగిస్తామని లుఖ్ చెప్పారు. ఇటీవలే 60వ పడిలో అడుగుపెట్టిన మారడోనా... తొలుత డిప్రెషన్, ఎనీమియా, డీహైడ్రేషన్ లక్షణాలతో ‘లా ప్లాటా’ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం సబ్డ్యూరల్ హెమటోమా నిర్ధారణ కావడంతో అతన్ని స్థానిక ఓలివోస్ క్లినిక్‌లో చేర్పించి వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు.