100 ఎకరాల్లో పెద్దల గృహాలు
♦ త్వరలోనే సంగారెడ్డిలో వంద ఎకరాల్లో ప్రాజెక్ట్ ప్రారంభం.. కస్టమర్లే కంపెనీ ప్రతినిధులు
♦ ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలో ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ శేషగిరిరావు
‘‘బటర్‌ఫ్లై సిటీలోని డాక్టర్స్ కాలనీలో ఫ్లాట్ తీసుకున్నా. ఎల్అండ్టీ మెట్రో రైల్లో ఉద్యోగరీత్యా ఇతర మెట్రో నగరాలు, దేశాలూ తిరిగాను. కంపెనీ గెస్ట్ హౌజ్‌లో, ఇతర ప్రాజెక్ట్ గెస్ట్ హౌజుల్లోనూ బస చేశా. కానీ, బటర్‌ఫ్లై సిటీలో క్లబ్‌హౌజ్ నిర్మాణం, దాని నాణ్యత మాత్రం ఎక్కడా చూడలేదు. ఇందులోని వసతులూ ప్రత్యేకమైనవే’’ - ఇదీ ఓ కస్టమర్ అనుభవం
‘‘కస్టమర్ మన దగ్గరికొచ్చి ఫ్లాట్ కొన్నాడంటే తనకి సేవ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించాడన్నమాట. తనని సంతృప్తి పరచడం మన బాధ్యతని దానర్థం. కస్టమర్లేం మనల్ని మణులు కావాలనో.. మాణిక్యాలు కావాలనో అడగరు. జస్ట్ బ్రోచర్లో ఇచ్చిన హామీలను నెరవేరిస్తే చాలు. అంతకు మించి ఏం కోరుకోరు’’!! - ఇదీ ఫార్చూన్ ఇన్ఫ్రా సీఎండీ మాట
సాక్షి, హైదరాబాద్: పై రెండు సందర్భాలు ఎక్కడివో తెలుసా.. ఫార్చూన్ ఇన్ఫ్రా దశాబ్ద వేడుకలవి. ఇటీవల సంస్థ పదేళ్ల వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సీఎండీ బీ శేషగిరి రావు ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నా దృష్టిలో డెవలపర్ అంటే ఫ్లాట్‌లో.. ప్లాట్‌లో విక్రయించేసి చేతులుదులుపు కోవటం కాదు. కస్టమర్ల పెట్టుబడికి నాలుగింతల వృద్ధి వచ్చేలా చేయడం. అది కూడా జీవితకాలం పచ్చని ప్రకృతిలో కుటుంబంతో కలిసి నివాసముండేలా వేదికను అందించడం. అందుకే భవిష్యత్తు అభివృద్ధి ఆస్కారముండే ప్రాంతాన్ని ఎంచుకుని ఏకంగా నగరాన్నే నిర్మించాలని నిర్ణయించుకున్నా. బటర్‌ఫ్లై సిటీ నిర్మాణానికి ఆదర్శం.. కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ సిటీ శాటిలైట్ టౌన్షిప్పే. కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, కడ్తాల్ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ పేరుతో సరికొత్త టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం.
⇒ మొత్తం 3,600 ఎకరాల ప్రాజెక్ట్. ఇందులో 3 వేల ఎకరాలు నివాస, 600 ఎకరాలు వాణిజ్య సముదాయాలకు కేటాయించాం. విద్యా, వైద్య, వినోద, ఆట మైదానాలకు ప్రత్యేక కేటాయింపులు చేశాం. నివాస విభాగంలో 2,500 ఎకరాలు ఫ్లాట్స్ + ప్లాట్స్, 500 ఎకరాలు విల్లాలుంటాయి. పదేళ్ల కాలంలో ఇక్కడి అభివృద్ధి ఏంటంటే.. 1,200 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను విక్రయించాం. ఇందులో 25 ఎకరాల్లో 500 విల్లాలున్నాయి. 300 కుటుంబాలు నివాసముంటున్నాయి కూడా. నివాసితుల కోసం 26 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఏర్పాట్లు కల్పించాం. 5 ఎకరాల్లో ఫార్చూన్ బటర్‌ఫ్లై పాఠశాలను ఏర్పాటు చేశాం. ఈ స్కూల్ విద్యార్థుల సంఖ్య 1,489.
⇒ 100 ఎకరాల్లో ‘న్యూ లైఫ్ ఆఫ్ సీనియర్ సిటీజెన్స్’ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. 4,000 వేల ఫ్లాట్లుంటాయి. యోగా, మెడిటేషన్, సమావేశ గదులు, గుడి, లైబ్రరీ, జిమ్ వంటివెన్నో ఉంటాయి. త్వరలోనే సంయుక్త భాగస్వామ్యంతో ఆసుపత్రిని ప్రారంభించనున్నాం.
⇒ హైదరాబాద్‌లోని ఇతర హైవేల్లోనూ ప్రాజెక్ట్‌లను చేయాలని నిర్ణయించాం. తొలి దశగా ముంబై రోడ్లో సంగారెడ్డికి దగ్గర్లో 100 ఎకరాల్లో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నాం. ఈ ఏడాదిలో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం.
⇒ బటర్‌ఫ్లై సిటీని ప్రారంభించిన తొలి రోజుల్లో గజం ధర రూ.1,500లకు విక్రయించాం. ఇప్పుడక్కడ ధర రూ.3,500లుంది. మాకు 6,992 మంది కస్టమర్లున్నారు. ప్రస్తుతం నెలకు 150 బుకింగ్స్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల కస్టమర్లే కాదు బెంగళూరు, ఢిల్లీ, మధ్య ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా బుకింగ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మా ప్రాజెక్ట్‌లో గజం ధర రూ.2,500 నుంచి 5,800 వరకున్నాయి. ఫార్మా సిటీ కారణంగా శ్రీశైలం హైవేలో జరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా ఏడాదిలో 30 శాతం రేట్లు పెరిగే అవకాశముంది.
శ్రీశైలం హైవే వృద్ధి
⇒ ప్రస్తుతం నగరంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఏదైనా ఉందంటే అది దక్షిణ దిక్కే. ఎందుకంటే ఐటీ హబ్‌గా పేరున్న ప్రాంతాలన్నీ ఈ వైపునే ఉన్నాయి మరి. పెపైచ్చు కొత్తగా రానున్న యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సేల్స్‌ఫోర్స్ కంపెనీలు.. ఫార్మా సిటీ, ఫిల్మ్ సిటీ ఏదైనా దక్షిణ భాగంలోనే కొలువుదీరనున్నాయి. అందుకే దక్షిణ భాగంలో ఉన్న శ్రీశైలం హైవేలో స్థిరాస్తి మార్కెట్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
⇒ ప్రభుత్వం ఐటీతో పాటూ ఉత్పత్తి, ఫార్మా రంగానికి ప్రాధాన్యమిస్తుంది. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగావకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా కారిడార్‌ను ప్రకటించింది.
⇒ ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 70 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ఫార్మా రంగంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములకు గిరాకీ పెరుగుతుంది. ఇళ్లకు డిమాండ్ వస్తుంది. ఇప్పటికే ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లో గల ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో లగ్జరీ గృహాలకు గిరాకీ ఏర్పడట మనం చూశాం.
⇒ ప్రభుత్వం కూడా ఫార్మా సిటీకి అవసరమైన రహదారులు, నీటి వసతులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓఆర్ఆర్ తుక్కుగూడ జంక్షన్ నుంచి ఫార్మా సిటీకి నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయనుంది. దీంతో నగరంలోని ఏ మూల నుంచైనా ముచ్చర్లకు సులువుగా చేరుకోవచ్చు. వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి అవసరాలను తీర్చేందుకు డీపీఆర్‌ను రూపొందించింది.
⇒ శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీశైలం హైవే దూరం 25 కి.మీ. ఆదిభట్ల ఐటీ సెజ్ నుంచి నుంచి ఇక్కడికి దూరం 18 కి.మీ. జెడ్ఏకే, వీఐపీ, హుడా హై స్కూల్, ఆల్-కుర్మోషి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వంటి గుర్తింపు పొందిన విద్యా సంస్థలున్నాయి. లైఫ్‌లైన్ ఆసుపత్రి, ఆల్ మదీన్ జనరల్ ఆసుపత్రి, కాంపోసైట్ ఆసుపత్రులూ ఉన్నాయిక్కడ. బార్కాస్, వెంకటాపురం, తుక్కుగూడ ప్రాంతాలు నివాస సముదాయాలతో అభివృద్ధి చెందాయి.