'అది చాలా డేంజర్.. ఆమె చనిపోవడం ఖాయం'
టోరంటో: కెనడాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరారు. దీంతో ఆ పాఠశాలను పూర్తిగా మూసివేశారు. ఆ పాఠశాలలోని నలుగురు విద్యార్థినులు ఉగ్రవాద సంస్థలో చేరడం తమకు విస్మయాన్ని కలిగించిందని ఆలస్యం చేయకుండా ఆ పాఠశాలను మూసి వేయాలని ఆదేశాలు ఇచ్చామని కెనడా అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లోని ముల్తాన్ లోగల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాకిస్థాన్ అల్-హుదా పాఠశాలకు కెనడాలో ఒక బ్రాంచ్ ఉంది. దీనిని 2004లో ఇస్లామిక్ స్కాలర్ ఫర్హాత్ హష్మీ స్థాపించింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కాల్పులకు తెగబడి పలువురు ప్రాణాలు బలిగొన్న తష్పీన్ మాలిక్ చదివింది కూడా పాకిస్థాన్ లోని అల్-హుదా పాఠశాలలోనే కావడం గమనార్హం.
16 నుంచి 20 ఏళ్లలోపు ఉన్న నలుగురు చదువుకునే అమ్మాయిలు వారి చదువు ముగియగానే వెంటనే వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తమకు స్పష్టమైన ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. ఇలా ఇస్లామిక్ స్టేట్ లో చేరినవారిలో ముగ్గురు టర్కీ లో ఒకరు సిరియాలో ఉన్నట్లు చెప్పారు. కాగా, చదువు పూర్తి చేసుకొని సిరియా వెళ్లిపోయిన ఓ విద్యార్థిని సోదరి స్పందిస్తూ ఇది నిజంగా ఓ భయంకరమైన చర్య అని చాలా అపాయకరమైనదని, ఆమె దొరికితే మాత్రం కచ్చితంగా చంపేస్తారని వాపోయింది.