రఫెల్ ఒప్పందానికి ఆమోదం
శుక్రవారం సంతకాలు
న్యూఢిల్లీ: సుదీర్ఘ బేరసారాల అనంతరం 36 అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. 7.87 బిలియన్ యూరోల (రూ.59 వేల కోట్లు) విలువైన ఈ ఒప్పందంపై శుక్రవారం ఢిల్లీలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ లీ డ్రియాన్ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. గత 20 ఏళ్లలో యుద్ధ విమానాలు కొననుండడం ఇదే తొలిసారి. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన ఒప్పందంతో పోలిస్తే తాజా ఒప్పందం వల్ల 75 కోట్ల యూరోలు(రూ.5,600 కోట్లు) ఆదా కానున్నాయి.
అంతేకాకుండా భారత్‌లోని చిన్న, పెద్ద కంపెనీలకు 300 కోట్ల యూరోల (రూ.22 వేల కోట్లు ) వ్యాపారం, వందలాది ఉద్యోగాలు దక్కనున్నాయి. కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో అంతర్ప్రభుత్వ ఒప్పందానికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానాల కొనుగోలు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 150 కి.మీకి మించిన లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ వంటివి రఫెల్లో ఉన్నాయి.