సింగర్‌కు కిడ్నీ దానం చేసిన నటి
సాక్షి, హాలీవుడ్: ప్రముఖ పాప్‌సింగర్, నటి సెలెనా గోమెజ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయినట్లు ప్రకటించింది. ‘నా బెస్ట్ ఫ్రెండే నా ప్రాణం నిలిపిందంటూ’ ఆపరేషన్ సమయంలో బెడ్ మీద ఉన్న ఓ ఫోటోను సెలెనా షేర్ చేసింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. సెలెనాకు లూపస్ అనే వ్యాధి సోకింది. దాని వల్ల ఆమె శరీరంలోని గుండె, మెదడు, కిడ్నీల్లాంటి కీలక అవయవాలు పాడయిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వెంటనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందని ఆమెకు సూచించారు. దీంతో 29 ఏళ్ల ప్రముఖ నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. ఆపరేషన్ విజయవంతం అయ్యింది కూడా.
ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ... తన ఇన్స్టాగ్రామ్ లో సెలెనా ఓ పోస్టు ఉంచింది. ‘తాను గత కొంత కాలంగా మౌనంగా ఉండటంపై అభిమానుల్లో చాలా అనుమానాలు నెలకొన్నాయి. నా కొత్త ఆల్బమ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కూడా. కానీ, లూపస్ వ్యాధి కోసం శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకు కాస్త సమయం పట్టింది. నా కుటుంబ సభ్యులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫ్రాన్సియా తనకు అరుదైన బహుమతి(కిడ్నీ)ని ఇచ్చిందని, ఆమె చేసిన త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సెలెనా తెలిపింది. పనిలో పనిగా లూపస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింకును కూడా ఆమె పోస్ట్ చేసింది.
సెలెనా ఆరోగ్య సమస్య.. ఆమె ఆపరేషన్ విషయం పాప్ సింగర్, మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్ కు కూడా తెలియదంట. ఆ మధ్య ట్విట్టరెక్కి ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందన్న విషయం తెలుసుకున్న బీబర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.