ప్రీ బడ్జెట్ సమావేశాలు పెట్టాలి: పొంగులేటి
హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. అసెంబ్లీ బదులు ప్రగతి భవన్లో వివిధ వర్గాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్షాలతో సమావేశమై అందిన సూచనల ప్రకారం వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని సూచించారు. రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుని వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని కోరారు.. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణలో 19.5 శాతం వృద్ధి రేటు ఉందంటున్న సీఎం రైతు రుణమాఫీకి ఫీజు రీయింబర్స్ మెంటు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి పథకాలకు నిధులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసిన రూ.60 వేల కోట్ల అప్పులను ఎలా ఖర్చు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని కోరారు. నిధులన్నీ రెండు పథకాలకు, కాంట్రాక్టర్లకేనా అని నిలదీశారు. ఇప్పటికే ఓసారి విద్యుత్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు... మళ్లీ పెంచితే ప్రజలు భరించరు... కాంగ్రెస్ సహించదు అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ శాఖల వారీ సమీక్షల పేరుతో అభివృద్ధి జరుగుతున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉందని నేతలు చేసే కామెంట్లు అనర్థాలకు దారి తీయరాదని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాలే కానీ బాహాటంగా మాట్లాడడం సరికాదన్నారు. నేతలకు స్వీయ నియంత్రణ ఉండాలన్నారు.