ఏపీ: వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఫ్రీ హెల్త్ క్యాంపు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు శ్రమించి విధులు నిర్వహించే ఫ్రంట్ లైన్లో జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖలు సంయుక్తంగా హెల్త్‌క్యాంప్ నిర్వహిస్తున్నాయి. జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు.
విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో మే 13, 14వ తేదీల్లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. జర్నలిస్ట్ కుటుంబాలకు ఫ్రీగా వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రా హాస్పిటల్, కేపిటల్, కామినేని, సెంటిని, పిన్నమనేని, అమెరికన్ ఆంకాలజీ & ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డిక్ సెంటర్, HCG క్యూరి సిటీ క్యాన్సర్ సెంటర్ & హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్, అను, స్వర హాస్పిటల్.. మొత్తం 11 ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనుంది.
ఇప్పటికే https://forms.gle/UEKdx4fZG7yUGBns7 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు.. శనివారం(మే 13వ తేదీ) ఉదయం 7 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు హెల్త్ క్యాంపులో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. తొలి రోజు వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తారు. రెండో రోజు(మే 14వ తేదీన) డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది.
రెండు రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(హెల్త్ క్యాంపు) లో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్ లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలకు సైతం అవసరమైన వైద్య సదుపాయం అందిస్తారు.
హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేశాక.. అత్యవసర వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్ కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లిస్తుందని కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అవసరం మేరకు హెల్త్ క్యాంపులో కూడా కొత్తగా హెల్త్ కార్డు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
క్యాంపుకు హాజరయ్యే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లేదంటే విధులు నిర్వర్తిస్తున్న సంస్థకు సంబంధించిన గుర్తింపు(ఐడీ) కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
ఈ క్యాంప్ నిర్వహణ కోసం.. ప్రభుత్వం చర్చలు జరిపింది. మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, విడదల రజని, సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరిందర్ ప్రసాద్ సమీక్షలు నిర్వహించారు కూడా.
ఇదీ చదవండి: కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి