ఫ్రీ టాక్ టైమ్ స్కీమ్ ప్రవేశపెట్టిన గోవా
పనాజీ(గోవా): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువతను ఆకర్షించడానికి గోవాలోని బీజేపీ సంకీర్ణ సర్కారు దేశంలోనే ప్రథమంగా ఫ్రీ టాక్ టైమ్, ఫ్రీ డేటా స్కీమ్‌ను ప్రకటించింది. 'గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్' పేరుతో 100 నిమిషాల టాక్ టైమ్, 1జీబీ డేటా(2ఎంబీపీఎస్ స్పీడు) ఉచితంగా అందిస్తారు. 1.25లక్షలు మంది యువత ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వానికి కోటి రూపాయల వరకు భారం పడనుందన్నారు. 16 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ స్కీమ్‌కు అర్హులని పరీకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను అనుసంధానం చేయడంతో పాటూ, స్కిల్స్ డెవలప్ మెంట్ కోసం ఈ పథకం ఉపయోగపడనుందని తెలిపారు. దీనికి వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మొబైల్ సేవల పథకాన్ని అమలు చేయడానికి రిలయన్స్ జియో, ఐడియాతో పోటీ పడి వోడాఫోన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. గోవా వ్యాప్తంగా 500కు పైగా రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసి మరో 15 రోజుల్లో వోడాఫోన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుందని పరీకర్ తెలిపారు.