నగరానికి పంద్రాగస్టు శోభ
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటను క్రీస్తుశకం 945 – 970 మధ్య కాలంలో కాకతీయులు నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ప్రతాపరుద్రుడి కాలంలో కేవలం మట్టితోనే ఈ కోటను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. 10వ శతాబ్దంలో కుతుబ్షాహి పాలకులు దీన్ని మళ్లీ నిర్మించారు. 1518–1543లో సుల్తాన్ కులీ కుతుబ్‌షా ముల్క్, 1543 – 1550 మధ్య జంషీర్ కులీకుతుబ్ షా, 1550 – 1580 వరకు పాలించిన ఇబ్రహీం కుతుబ్‌షాలు మట్టి నిర్మాణం అలాగే ఉంటే దండయాత్ర చేసే రాజుల ఫిరంగి గుళ్లకు కోట బీటలు వారుతుందనే ఉద్దేశంతో భారీ నిర్మాణాన్ని సరికొత్త పద్ధతిలో చేపట్టారు. దేశంలోని ఇతర కోటలైన దౌల్తాబాద్, రాజస్థాన్ కోటల కంటే మరింత పటిష్టంగా దీనిని నిర్మించారు.
అందుకే ఔరంగజేబు ఈ కోటను జయించలేక అక్కడ కాపలాదారుడిగా ఉన్న అబ్ధుల్లాఖాన్ను లోబర్చుకుని కోటలోకి చొరపడ్డాడని చరిత్ర చెప్తోంది. వారు అక్కడ కాలుపెట్టిన తర్వాత ఈ కోటకు ‘మహ్మద్ నగర్’ అనిపేరు పెట్టి అక్కడ తొలి నగరాన్ని తీర్చిదిద్దాడు. అదే క్రమంగా హైదరాబాద్‌గా అభివృద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కోటలో అన్ని మతాల వారు, వర్గాల వారు కలిసిమెలిసి జీవించారు. అక్కడ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, పచ్చిక ప్రార్థనా మందిరాలు, మసీదులు, రాజభవనాలు నిర్మించారు. కుతుబ్ షాహీల రాజధాని కేంద్రంలో జనాభా సంఖ్య నానాటికీ పెరుగుతుండటంలో ఇబ్రహీం కుతుబ్ షా మూసీనదికి దక్షిణాన హైదరాబాద్ నగర్ విస్తరణకు 1591లో శంకుస్థాపన చేశారు. అలా మహానగరం విస్తరించింది.
కోటలోని చెప్పుకోదగ్గ పది ప్రత్యేకతలు ఉన్నాయి. కందక నిర్మాణం, కోటగోడలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కాగజ్ బురుజు, అక్కన్న మాదన్న ప్యాలెస్, హెలిపెంట్ ట్రీ, సింహ ద్వారాలు, కటోరా హౌస్, ప్రభుత్వం ఉద్యాన వనాలు, కోహినూర్ కీ కహానీలు చూపరులను కట్టిపడేస్తున్నాయి
22 కళారూపాలు... 650 మంది కళాకారులు...
గోల్కొండ కోటలో ఆగస్టు 15న జరిగే మువ్వన్నెల జెండా పండుగ సందర్భంగా దాదాపు 650 మంది కళాకారులు 22 వివిధ కళారూపాలను భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు. గతేడాది కళాకారుల ప్రదర్శనను అంతర్జాతీయ పత్రికలు ఆకాశానికి ఎత్తేస్తు కథనాలు రాశాయి. అంత అద్భుతంగా కళా ప్రదర్శనలు జరిగాయి. ఈసారి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 22 కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడీ, కొమ్ముకోయ, డప్పులు, పేర్ని, నగర కళ పేర్ని– బాజా, ఖాంద్రా(పంజాబీ), రాజస్థానీ, గుజరాతీ దాండియా, కథక్, ముజ్రా లాంటి కళారూపాల ప్రదర్శనలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సరిగ్గా ఉదయం 15న ఉదయం 8.30కి ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. 9.30కి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే 650 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శనలు ఇస్తూ స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా హుస్సేన్ సాగర్‌లోని జాతీయ జెండా వద్ద 100 మంది కళాకారులు స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన థీమ్ సాంగ్‌కి కళాప్రదర్శన ఇస్తారు. చిన్న వయసులోనే సూక్ష్మచిత్ర కళలో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా గుమ్మిరియాల గ్రామానికి చెందిన రామోజు మారుతిని ప్రభుత్వం ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువతో సత్కరించనుంది.