V R Lalithambika : వీఆర్ అంటే విజయ సంకేతం
ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ‘ఫెయిల్యూర్’ ఎదురొచ్చి భయపెట్టాలని చూసింది. ‘అంతా గందరగోళం’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సందేహం వచ్చినప్పుడు ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే భయం ఉండేది. అయినా సరే... ‘ఇస్రో’ రహదారిలో లలితాంబిక ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు. అడుగడుగునా పాఠం నేర్చుకుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో టాప్ ఇంజనీర్లలో ఒకరిగా ఎదిగింది. తాజాగా... అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ‘ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్’ను అందుకుంది వీఆర్ లలితాంబిక...
కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది లలితాంబిక. తండ్రితో సహా చుట్టాలలో ఎక్కువమంది ఇంజినీర్లు. గణితశాస్త్రంలో దిట్టగా పేరున్న తాత వల్ల లలితకు శాస్త్రీయ విషయాలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తే ఇస్రో వరకు తీసుకువెళ్లింది.చదువు పూర్తికాగానే పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత కూడా చదువుకు విరామం ఇవ్వలేదు లలిత. ఎంటెక్ చేస్తున్న కాలంలో ఆమెకు కూతురు జన్మించింది. కాలేజీకి విరామం ఇచ్చినప్పటికి స్నేహితురాలు తెచ్చి ఇచ్చిన క్లాసులకు నోట్స్ ఇంట్లోనే చదువుకునేది. 1998లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరింది. కొద్దిరోజుల్లోనే తాను పనిచేస్తున్న ఏరియాలో కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల ఫెయిల్యూర్ ఎదురైంది.
‘ఆ రోజుల్లో ప్రతిదీ కొత్తగానే అనిపించేది. ప్రతిరోజూ ఒక సవాలుగానే ఉండేది. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఉండేవి కాదు. సీనియర్లను అడగాలంటే భయంగా ఉండేది. ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగానే ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లలిత. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు లలిత యంగ్ మదర్.
ఒకవైపు... ఏ టైమ్‌కు ఇంటికి వెళతారో తెలియనంత ఊపిరి సలపని పని. మరోవైపు... పని విరామంలో పదే పదే గుర్తుకు వచ్చే బిడ్డ. 1993లో పీఎస్ఎల్వీ లాంచ్ ఫెయిల్ అయింది. అదే సంవత్సరం రెండో ప్రయత్నానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. పని ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి క్లిష్టమైన కీలక సమయంలోనూ ఎప్పుడూ ‘ఇక చాలు. ఈ ఉద్యోగం చేయడం మన వల్ల కాదు’ అనుకోలేదు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంది.
‘ఆ సమయంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నాం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఇస్రో సంస్కృతిలో ఒకటి’ అంటుంది లలిత. సెకండ్ పీఎస్ఎల్వీ లాంచ్ సక్సెస్‌కు సంబంధించిన ఆనందం లలితకు ఆత్మస్థైర్యం, అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది.
‘పీఎస్ఎల్వీలో ఆటోపైలట్ సిస్టమ్ విభాగంలో చాలాకాలం నుంచి ఉన్నాను. లాంచ్ రోజులు ఉత్కంఠభరితమైనవి. అదే సమయంలో సంతోషం రూపంలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేవి. ప్రతి ఫెయిల్యూర్ కొత్త పాఠం నేర్పేది. ప్రతి సక్సెస్ కొత్త శక్తిని ఇచ్చేది’ అంటుంది లలిత.
‘మీ విజయరహస్యం?’ అనే ప్రశ్నకు లలిత చెప్పే మాట... ‘ఫ్యామిలీ సపోర్ట్’
‘లాంచ్‌కు సంబంధించిన రోజుల్లో పనే లోకంగా ఉండేవాళ్లం. ఏ టైమ్‌కు ఇంటికి చేరుతామో తెలియదు. ఇలాంటి సమయంలోనూ నాకు కుటుంబ మద్దతు రూపంలో ప్రోత్సాహం, బలం లభించాయి. వ్యక్తిగత త్యాగాలను కూడా ఇష్టపూర్వకంగా చేసే రోజులు అవి. స్త్రీ, పురుషులను వేరు వేరుగా చూడడం అనే సంస్కృతి ఇస్రోలో కనిపించేది కాదు. ఎవరైనా ఒక్కటే అన్నట్లుగానే ఉండేది. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు’ అంటుంది లలిత.
ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం విషయానికి వస్తే...
ఫ్రాన్సు, మన దేశం మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడంలో చేసిన విశేష కృషికి ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగామ్ మాజీ డైరెక్టర్ అయిన వీఆర్ లలితాంబికను ఫ్రెంచ్ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి మాథ్యూ నుంచి ఈ అవార్డ్ అందుకుంది లలిత. ‘అంతరిక్ష సాంకేతికతలో విశిష్ట శాస్త్రవేత్త’ అని మాథ్యూ లలితాంబికను కొనియాడారు. ‘ఈ గౌరవం మరింత మంది మహిళలు స్టెమ్ రంగాలలోకి రావడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటుంది వీఆర్ లలితాంబిక.