మార్కెట్లకు ‘ఫ్రెంచ్’ కిక్
సెన్సెక్స్ 291 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు అప్
ముంబై: ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి బలమైన సానుకూల సంకేతాలు, కంపెనీల మెరుగైన ఫలితాలతో దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం బుల్స్ జోరు పెంచాయి. ఆరు వారాల తర్వాత సెన్సెక్స్ ఒకే సెషన్లో అత్యధికంగా 291 పాయింట్లు మేర లాభపడింది. 29,656 వద్ద క్లోజయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం మరోసారి 9,200 మార్క్‌ను అధిగమించింది. 98.55 పాయింట్ల లాభంతో 9,217.95 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,225.40 – 9,130.55 పాయింట్ల మధ్య ట్రేడయింది. రోజంతా సూచీలు లాభాల్లోనే కొనసాగాయి.
‘‘పెద్ద కంపెనీల నుంచి మంచి ఫలితాలు రావడం రికవరీ విషయంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగుపడింది. దీనికితోడు ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో సానుకూల ఫలితాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన రిలీఫ్ ర్యాలీ సైతం దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలకు దారితీసింది’’ అని జియోజిత్ ఫైనాన్షియిల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.
లాభపడ్డ షేర్లు : త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించనుండడంతో ఆర్ఐఎల్ 1.19 శాతం లాభంతో రూ.1,416.40 వద్ద క్లోజయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2.41 శాతం లాభంతో రూ.1,532.75 వద్ద ముగిసింది. గతవారం బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎస్ఎంఈ ఐపీవోలపై చూపు!
ఈ ఏడాది రూ.514 కోట్ల సమీకరణ
చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎస్ఎంఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 39 ఎస్ఎంసీలు ఐపీవో ద్వారా రూ.514 కోట్లు సమీకరించాయి. కాగా గతేడాది మొత్తంగా 66 ఎస్ఎంఈలు ఐపీవో ద్వారా రూ.540 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన 39 కంపెనీల్లో 22 ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయ్యాయి. ఇవి రూ.365 కోట్ల నిధులు సమీకరించాయి.
రూ.124 లక్షల కోట్లకు బీఎస్ఈ కంపెనీల విలువ
బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారంతో సరికొత్త శిఖరాలను చేరుకుంది. రూ.124 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడడం ఇందుకు కలసివచ్చింది. సోమవారం నాటి ముగింపు ధరల ప్రకారం చూస్తే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,24,41,895 కోట్లుగా ఉంది.
అక్షయ తృతీయ రోజున గోల్డ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్ వేళలు పెంపు
ఈ నెల 28న అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), సావరీన్ గోల్డ్ బాండ్లలో ట్రేడింగ్ వేళలను సాయంత్రం 7 గం.ల. దాకా పొడిగిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెల్లడించాయి. సాధారణ మార్కెట్ ట్రేడింగ్ వేళలు సాయంత్రం 3.30 గం.లకు ముగసిన తర్వాత 4.30 గం.ల నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లలో మళ్లీ ట్రేడింగ్ ప్రారంభమై 7 గం.లదాకా కొనసాగుతుందని పేర్కొన్నాయి. యాక్సిస్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, రిలయన్స్, క్వాంటమ్ రెలిగేర్, కోటక్, బిర్లా సన్‌లైఫ్ మొదలైన మ్యూచువల్ ఫండ్స్‌కి చెందిన గోల్డ్ ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ జరుగుతుంది.