friday night
-
కొడుకుని చంపిన తండ్రి
భార్యను పుట్టింటి నుంచి తీసుకురావాలని తండ్రితో వాగ్వాదం రోకలితో బాదిన తండ్రి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి సిద్దిపేట రూరల్: మద్యం మత్తులో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. ఈ సంఘటన చిన్నకోడూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... చిన్నకోడూరుకు చెందిన వేల్పుల నరేశ్(21) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నరేష్ నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నరేష్ భార్య మౌనికతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో నరేష్ రోజు మద్యం తాగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. శుక్రవారం రాత్రి నరేష్ మద్యం తాగి ఇంటికి వచ్చి, తండ్రి నాగరాజుతో గొడవకు దిగాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసుకురావాలని తండ్రితో నరేష్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇంట్లో పక్కనే ఉన్న రోకలితో నాగరాజు కొడుకు మెడపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో నరేష్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు నరేష్‌ను ఓ ఆటోలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. దీనికి కారణమైన మృతుడి తండ్రి నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
శేష వాహనంపై గౌరీపుత్రుడు
–పులకించిన భక్తజనం కాణిపాకం(ఐరాల): స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై ఆలయ మాడవీధులు, కాణిపాకం పురవీధుల్లో విహరించారు. శేష వాహన ఉత్సవానికి కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మెజీపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లెలకు చెందిన కమ్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారి మూల విగ్రహనికి సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. నివేదన చేసి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు.రాత్రి స్వామివారికి పెద్దశేషవాహన సేవ నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో ఉంచారు. ఊరేగింపుగా వచ్చిన ఉభయదారుల ఉభయంతో ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి పై తీసుకు వచ్చి పెద్దశేషవాహనంపై అధిష్టింప చేశారు.ప్రత్యేక పూజల అనంతరం కాణిపాకం పురవీధుల్లో మేళతాళాలు,మంగళవాయిద్యాలనడుమ ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఉభయదారులు,ఉత్సవకమిటీ సభ్యులు,అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని పెరవలి ఏఎస్సై మృతి
పెరవలి : ఓ ప్రయివేటు బస్సు ఢీకొన్న ఘటనలో పెరవలి హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జొన్నాడ ధనరాజ్(59) అక్కడికక్కడే మతిచెందారు. పెరవలి అభయాంజనేయస్వామి సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైవే పెట్రోలింగ్ డ్యూటీలో రాత్రి 11 గంటలకు ధనరాజ్ అన్నవరప్పాడు నుంచి జీప్‌లో బయలు దేరి పెరవలి సెంటర్‌కు వచ్చారు. కారును రోడ్డు పక్క నిలుపుదల చేసి రోడ్డుకి రెండో వైపున ఉన్న బీట్ కానిస్టేబుళ్లకు సూచనలు ఇచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో వేగంగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ధనరాజ్‌ను ఢీకొంది. ధనరాజ్ 50 మీటర్లు ఎగిరి పడడంతో తల నేలకు గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును నిలుపుదల చేయకుండా వేగంగా వెళ్లిపోవడంతో కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు తణుకు సమీపంలో పోలీసులు బస్సును పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించేశారు. పెరవలి ఎస్సై నాగరాజు, తణుకు సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బస్సు వచ్చి ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రై వర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధనరాజ్ భార్య మంగతాయారు భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో ఏడాదిలో ఉద్యోగం నుంచి రిటైరై హాయిగా విశ్రాంతి తీసుకుందామనకుంటుండగా మృత్యువు కబళించిందని ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. 1979లో ఉద్యోగంలో చేరిన ధనరాజ్ పెనుమంట్ర గ్రామానికి చెందిన ధనరాజ్ 1980లో కానిస్టేబుల్‌గా నరసాపురం టౌన్‌స్టేషన్‌లో తన తొలి పోస్టింగ్ పొందారు. ఈయనకు భార్య మంగతాయారుతో పాటు కుమారుడు రామాంజనేయులు, కుమార్తె ధరణి ఉన్నారు. కుమార్తెకు మూడేళ్ల క్రితం వివాహం చేశారు. కుమారుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. ధనరాజ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్సై స్థాయికి చేరుకున్నారు.