నరేశ్ మృతదేహం
భార్యను పుట్టింటి నుంచి తీసుకురావాలని తండ్రితో వాగ్వాదం
రోకలితో బాదిన తండ్రి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సిద్దిపేట రూరల్: మద్యం మత్తులో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. ఈ సంఘటన చిన్నకోడూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... చిన్నకోడూరుకు చెందిన వేల్పుల నరేశ్(21) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే నరేష్ నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నరేష్ భార్య మౌనికతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో నరేష్ రోజు మద్యం తాగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. శుక్రవారం రాత్రి నరేష్ మద్యం తాగి ఇంటికి వచ్చి, తండ్రి నాగరాజుతో గొడవకు దిగాడు.
పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసుకురావాలని తండ్రితో నరేష్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇంట్లో పక్కనే ఉన్న రోకలితో నాగరాజు కొడుకు మెడపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో నరేష్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు నరేష్‌ను ఓ ఆటోలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు.
దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సైదులు, ఎస్‌ఐ అశోక్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. దీనికి కారణమైన మృతుడి తండ్రి నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.