full statehood
-
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
'ఢిల్లీ ప్రజల ఓట్లకు ఎందుకు తక్కువ విలువ'
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన చిరకాల వాంఛను మరోసారి బయటపెట్టారు. చత్రసాల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన కేజ్రీవాల్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. మిగతా రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కోరారు. 'ఢిల్లీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల కంటే అధికారాలు ఎందుకు తక్కువ ఉన్నాయి?.. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల ప్రజల ఓట్ల విలువ కంటే.. ఢిల్లీ ప్రజల ఓట్లకు ఎందుకు తక్కువ విలువ ఉంటుంది' అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలకు వారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది కానీ.. ఆ ప్రభుత్వానికి మాత్రం పరిమితులతో కూడిన అధికారాలు మాత్రమే ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పరిస్థితి 1935 భారత ప్రభుత్వ చట్టం తరహాలో ఉందని అన్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో కూడా ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించారు గానీ.. ఎన్నికైన వారికి మాత్రం ప్రభుత్వాన్ని నడిపే అధికారం ఇవ్వలేదని తెలిపారు.